టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కేసీఆర్ చీవాట్లు

ఎమ్మెల్యేల పై వస్తున్న ఫిర్యాదులను ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా స్పందిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వం పేరు చెప్పి ఎవరు బెదిరింపులకు గురిచేసినా తనకు నేరుగా చెప్పవచ్చని ప్రకటించిన కేసీఆర్ తనకు అందే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలక మంత్రిని ఓడించిన యువ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కేసీఆర్ గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే ఇటీవల తన నియోజకవర్గంలోని మిల్లర్ల యజమానులను పిలిచి మాట్లాడుతూ వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా తన వద్దకు రావాలని తాను వారికి అండగా ఉంటానని చెప్పి పనిలో పనిగా తనుకు ‘ ఫార్చూనర్’ కారును ఇవ్వాలంటూ హుకూం జారీ చేశాడట. దీనితో ఖంగు తిన్న మిల్లర్ల యజమానులు నేరుగా ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేయడంతో వెంటనే సదరు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, తనును కలవడానికి ఎంత సేపట్లో రాగలవు అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలే నియోజకవర్గంలో ఉన్నానని కనీసం మూడు, నాలుగు గంటల్లో వచ్చేస్తానని చెప్పడంతో ‘ఫార్చూనర్’ కారులో అయితే రెండు గంటల్లో వచ్చేసేవాడివంటూ ముఖ్యమంత్రి అనడంతో సదరు ఎమ్మెల్యేకు నోట మాట రాలేదని తెలిసింది. నియోజక వర్గాల్లో ఎవరు ఏంచేసినా తనకు తెలుస్తుందని ఇట్లాంటి పిచ్చి పనులు చేయవద్దని గట్టిగానే హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పటికే ప్రజల్లో సరైన పేరు లేదు, వ్యాపారులను, పారిశ్రామిక వేత్తలను వేధిస్తూ ఊరుకునేది లేదంటూ గట్టిగానే హెచ్చరించినట్టు తెలుస్తోంది.