ఇద్దరు అమ్మాయిలు కలిసి చేసిన ప్రాజెక్టు. అంత మాత్రాన తీసిపారేస్తారా..!

అమ్మాయిలు అంటే కొన్ని ఫిక్సుడు ఉద్యోగాలు మనం ఊహించుకొంటాం. టీచర్లు, నర్సులు, డాక్టర్లు కాదంటే బ్యాంకు ఉద్యోగాలు.. అంతకు మించి మహిళల్ని మిగిలిన రంగాల్లో పెద్దగా చూడటానికి ఇష్టపడం. పవర్ ఫుల్ ప్లేస్‌ లు, సెలబ్రిటీ ప్లేస్‌ లలో కూడా కొంత వరకే ఛాన్స్ ఉంటుంది. ఇక సినిమాలు, టీవీల్లో అయితే గ్లామర్‌ రోల్స్ చేయటానికే ఫిక్సు చేసి ఉంచాం. కానీ ఇద్దరు అమ్మాయిలు ఈ ఒరవడికి అడ్డం తిరిగారు. కసిగా సినిమా తీసి చూపిస్తాం అని నిర్ణయించుకొన్నారు. బలమైన కథను రెడీ చేసుకొని సినిమా ను కళ్ల ముందు నిలిపారు. అది కూడా పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు, బాగా చదువుకొన్న అమ్మాయిలు.. నేరుగా సినిమా నిర్మాణ రంగంలోకి దిగేసరికి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అయినా సరే పట్టుదలగా “కాశి ” సినిమా తీసి తామేంటో రుజువు చేసి చూపించారు.
ఇందులో ఒక అమ్మాయి పేరు కృత్తికా ఉదయనిధి. అక్షరాలా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి కుటుంబంలోంచి వచ్చారు. కుటుంబ పెద్దలు అంతా రాజకీయాలతో తమిళనాడుని శాసించే స్థాయిలో ఉంటే తాను మాత్రం సినిమా తీస్తానని మంకుపట్టు పట్టి మరీ సినిమా రంగంలోకి దిగారు. మెగాఫోన్‌ చేత్తో పట్టుకొని సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో లైఫ్‌ స్టయిల్ మ్యాగజైన్‌ ఇన్‌ బాక్స్ కు నాయకత్వం వహించిన అనుభవంతో … మనుషుల మనస్సుల్ని బాగా పసిగట్టడం ఆమెకు బాగా తెలుసు. అందుకే వణక్కం చెన్నయ్‌ అంటూ ఆమె తీసిన ఫిల్మ్ గతంలో తమిళనాడును ఊపేసింది. ఇప్పుడు మగాళ్ల ఆధిపత్య రంగంలో ఇంగ్లీషు చదువుకొన్న అమ్మాయి పడుతున్న తపన తమిళ పెద్దల్ని కదిలించింది. అందుకే కాశి సినిమా అంత వేగంగా తయారైంది.
మరో అమ్మాయి ఫాతిమా విజయ్‌ ఆంటోనీ. పేరులోనే విషయం అర్థం అవుతోంది. ప్రముఖ హీరో విజయ్‌ ఆంటోనీ భార్య ఈ అమ్మాయి. ఈ అమ్మాయి నిర్మాణ బాధ్యతలు తలకు ఎత్తుకొంది. ఈ ఇద్దరు అమ్మాయిలే అన్ని అయి ఈ సినిమా ను తీసుకొని వచ్చారు. సినిమా కోసం పడి చచ్చిపోయే భర్త విజయ్‌ ఆంటోని కోసం ఫాతిమా నేరుగా నిర్మాణ రంగంలోకి దిగారు. డ్రీమ్ ప్రాజెక్టు కోసం పగలు రాత్రి కష్టపడ్డారు. కాశి సినిమాను తెరకు ఎక్కించేందుకు అన్నీ తానై పరుగులు తీశారు.
తల్లి కోసం అల్లాడిపోయే యువకుడి చుట్టూ కథను అల్లుకొని కాశి సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. సినిమాలో డిఫరెంట్‌ షేడ్స్ లో హీరోని చూపించటం, కథలో కట్టిపడేసే కథనాన్ని నడిపించటం అంత ఆషామాషీ కానే కాదు. హీరో గా విజయ్‌ ఆంటోనీ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడని అర్థం అవుతుంది. అంజలి, సునైన నటన లో తమదైన శైలిలో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.
ఇదంతా ఒక ఎత్తయితే ఇద్దరు అమ్మాయిలు కాశి సినిమా తీసి ఆశీర్వదించమని ప్రేక్షకుల్ని అడుగుతున్నారు. ఈ సినిమా గురించి రివ్యూలు ఎలా రాసినా కానీ, ఏడు నిముషాల ట్రైలర్‌ కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అన్నం మెతుకుని పట్టి పదార్థాన్ని చెప్పేసే ప్రేక్షక దేవుళ్లు, ఈ ఇద్దరు అమ్మాయిల కష్టాన్ని బాగానే అంచనా వేయగలుగుతారు. అందుకే ధైర్యంగా తెలుగు లోకి ఈ సినిమాను తీసుకొని రావటం జరిగింది. మరి ఈ అమ్మాయిల కష్టం వెండి తెర మీద ప్రేక్షకుల్ని కట్టి పడేస్తోంది. అందుకే సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు మాత్రం మంచి మార్కులే వేస్తున్నారు. మీరు కూడా సినిమా చూడకపోతే ఒకసారి చూడండి. మన:స్ఫూర్తిగా మీ అభిప్రాయాన్ని చెబుదురు గాని.