ఆగస్టు చివరికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మొదటి దశను ఆగస్టు నెలాఖరుకల్లా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పనుల్లో వేగాన్ని పెంచింది. ఆగస్టు చివరినాటికి ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాకమంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన ప్రాజెక్టుపనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పురోగతిని వివరించారు. తెలంగాణ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి మంత్రి ఆరో ప్యాకేజీ పనులు జరుగుతున్నతీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆగస్టు చివరినాటికి మేడారంలోని ఒక పంపు ద్వారా చెరువులోని ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోస్తామన్నారు. దీనితో ప్రాజెక్టు ప్రారంభం అయినట్టేనని చెప్పారు. ఇప్పటివరకు మేడారంలో రెండు పంపులను బిగించినట్టు చెప్పారు. మొత్తం ఏడు పంపులకు గాను సెప్టెంబర్ నాటికి మరో రెండు పంపులను బిగిస్తామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయని హరీశ్ రావు వివరించారు. రాత్రనకా పగలనకా ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. గోదావరి నదిలో ప్రస్తుతం నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం పనిచేయడానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని వివరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాన్ని శరవేగంతో పూర్తి చేస్తున్నామన్నారు. రైతులకు సాగునీటిని అందిచాలనే ధ్యేయంతోనే పనులను ముమ్మరంగా చేయిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ పనుల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. ప్రాజెక్టు పనులు పూర్తిచేసి రైతులకు సాగునిటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో విపక్షనేతల విమర్శలను ఆయన తప్పుబట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పై సరైన అవగాహన లేకుండానే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. తమ్మడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం నివేదిక ఇచ్చినతరువాత కూడా అక్కడ బ్యారేజీని నిర్మించాలని కాంగ్రెస్ నేతలు చెప్తుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. అవివేకంతో, అవగాహనా రాహిత్యంతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్ రావు చెప్పారు. విపక్ష నేతలు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అయితే నీటి లభ్యత లాంటి కీలక విషయాన్ని విస్మరిస్తూ చేస్తున్న ప్రకటనల వల్ల వారే నవ్వులపాలవాల్సివస్తుందన్నారు.
telangana, telangana government, irrigation, irrigation projects, telangana irrigation projects, harish rao, telangana irrigation minister, kaleshwaram, kaleshwaram project, kcr, telangana cm.

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కమ్యూనిస్టు ఛానళ్లు


ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా?
projects