జర్నలిస్టుల చేతివాటం-విదేశాల్లో బజారున పడ్డ పరువు

కక్కూర్తి పనిచేసిన కొంత మంది జర్నలిస్టులు దేశం పరువును కాస్తా మంటగలిపారు. విలువైన వస్తువులు చేతివాటంగా దొరికితే వాటిని తస్కరించి జేబులో వేసుకోవడం చాలా మందికి అలవాటే. అదే అలవాటుతో కొంతమంది భారత జర్నలిస్టులు లండన్ లో పరువుతీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంట లండన్ కు వెళ్లిన పత్రికా ప్రతినిధి బృందానికి స్థానికంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో విందును ఏర్పాటు చేశారు. దానికి హాజరైన వారిలో కొంత మంది లొట్టలేసుకుంటూ వండివడ్డించిన పదార్థాలతో పాటుగా చేతికి దొరికిన వెండి చెంచాలు, పళ్లాలను ప్యాంటు జేబుల్లోనూ, చేతి సంచుల్లోనూ దాచేశారు. మన వాళ్ల చేతివాటం అక్కడి సిసి కెమేరాల్లో చక్కగా రికార్డయిపోయాయి. జర్నలిస్టుల చేతివాటాన్ని గుర్తించిన హోటల్ యాజమాన్యం తొలుత విందు ఏర్పాటు చేసిన వారికి ఫిర్యాదు చేయాలని భావించిందట. అయితే విదేశీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన విందు కావడంతో అనవసర వివాదం ఎందుకనుకున్న సదరు హోటల్ యాజమాన్యం సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలని భావించిందట.
దీనితో హోటల్ సెక్యూరిటీ సిబ్బంది చేతివాట ప్రదర్శించిన జర్నలిస్టుల వద్దకు వచ్చి మీరు చేసిన నిర్వాకం మొత్తం రికార్డయింది మర్యాదగా ఎక్కడ తీసిన వస్తువులను అక్కడే పెట్టి వెళ్లిపోవాలంటూ వినియంగా చెప్పారట. దీనితో నోటిలో పచ్చివెక్కాయ పడ్డ మన జర్నిలిస్టు సోదరులు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టేసి వెనక్కి వచ్చేయగా ఒక పెద్దమనిషి మాత్రం తనకు ఏమీ తెలియదని అనవసరంగా తన మీద అభాండాలు వేస్తున్నారంటూ సెక్యూరిటీ సిబ్బందిమీద చిర్రుబిర్రులాడడట. తాను ఏ వస్తువు తీయలేదని కావాలంటే తన బ్యాగ్ ను చెక్ చేసుకోవాలంటూ సవాల్ విసిరిన సదరు పెద్ద మనిషికి రికార్డయిన దృశ్యాలు చూపించిన సెక్యూరిటీ సిబ్బంది అతనికి జరిమానా సైతం విధించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ పెద్ద మనిషి తాను తీసిన వెండి పళ్లాన్ని ముందు జాగ్రత్త చర్యగా సహచర జర్నలిస్టు చేతిసంచిలో వేశాడు. అదికూడా రికార్డు కావడంతో జరిమానా చెల్లించి బయటపడడ్డాడట సదరు పెద్ద మనిషి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *