జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారు?

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రానున్నారా..? ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాలతో పాటుగా రాజకీయా ఆశక్తి ఉన్న వారందరూ చర్చించుకుంటున్నారు. జగన్ అవినీతి కేసుల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన పేరు కూడా జేడీ లక్ష్మీ నారాయణగా స్థిరపడిపోయింది. అంతగా ఆయన పాపులర్ అయ్యారు.
జగన్ అరెస్టు చేయడం దగ్గరి నుండి ఆయన్ను దఫదఫాలుగా విచారణ జరిపిన అధికారిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీనారాయణ భారీగానే ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సీబీఐ నుండి బదిలీ అయిన తరువాత ఆయన తిరిగి మహారాష్ట్ర రాష్ట్ర పోలీస్ సర్వీసుల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఐదనపు ఐజీగా కొనసాగుతున్న ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు సుమారు ఏడేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ముందుగానే పదవీవిరణకు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది.
కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ 1990లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. మహారాష్ట్ర క్యాడర్ కు ఎంపికయిన ఆయన సంచనాలకు కేంద్ర బిందువు అయిన మహారాష్ట్ర ఏటీఎస్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అందులో ఎస్పీ, డీఐజీగా పనిచేసిన ఆయన కేంద్ర సర్వీసుల్లో భాగంగా సీబీఐకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జాయింట్ డైరెక్టర్ గా చేరారు. ఈ సమయంలోనే జగన్ అక్రమ ఆస్తుల కేసుతో పాటుగా సత్యం కుంభకోణం, ఓబుళాపురం మైనింగ్ లాంటి సంచలన కేసులకు దర్యాప్తు అధికారిగా పనిచేశారు.
తెలుగు వాడయిన జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశం కోసమే ఐపీఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆయనకు యువతలో మంచి ఫాన్ పోలోయింగ్ ఉంది. ముక్కుసూటి అధికారిగా, అవినీతికి పాల్పడని వ్యక్తిగా మంచి పేరు సంచాదించుకున్న ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరుతున్నారనేది అవిశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీ రాష్ట్ర బీజేపీలో లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా లక్ష్మీనారాయణ సేవలకు ఉపయోగించుకునేందుకు ఆశక్తిగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం బీజేపీలోనే చేరతారని చెప్తున్నారు.
మంచి వాగ్ధాటితో పాటుగా సామాజిక అంశాలపై మంచి అవగాహన ఉన్న జేడీ లక్ష్మీనారాయణ రానున్న రోజుల్లో బీజేపీకి గట్టి నాయకుడు అవుతాడని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బలమైన సమాజిక వర్గానికి చెందిన ఆయన తమ పార్టీలోకి రావడం వల్ల బీజేపీ ఏపీలో మరింత బలపడుతుందని ఆ పార్టీనేతలు భావిస్తున్నారు. ఆయన్ను పార్టీలోకి తీసుకుని వచ్చేందుకు బారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది.
మరో ఏడు సంవత్సరాల పదవీ కాలాన్ని వదులుకుని మరీ రాజకీయాల్లోకి వస్తున్న జేడీ లక్ష్మీనారాయణకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఏపీలో తెలుగుదేశం పార్టీతో సంబంధాలు పూర్తిగా చెడిపోయిన తరువాత ఆ పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్న బీజేపీ అమ్ముల పొదిలో ఆయన మరో కీలక అస్త్రం కానున్నారు.
lakshmi narayana, j.d.lakshmi narayana, tdp, bjp, cbi, cbi joint director.