ఎవరెట్లా ఛస్తే మాకేంటి….

ఎవరు ఛస్తే మాకేంటి…ముడుపదుల వయసు దాటకముందే నిండు నూరేళ్ల ఆయుష్షు అర్ధాంతరంగా గాలిలోకలిసేపోతే మాకేంటి…మాకు అవేవి పట్టవు. కనీసం తలుచుకోవాలనే ఆలోచన కూడా మాకు రాదు. గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు ప్రతీ రెండు గంటలకు ఒకసారి మెసేలు పంపుకుంటాం… ఎక్కడెక్కడివో కొటేషన్లు వెతికి మరీ పంపుకుంటాం… లేదా అబద్దాల ప్రచారాలతో బిజీగా గడుపుతాం. మా బిజీ జీవితంలో నలుగురు సైనికులు చనిపోవడం ఏమంత పెద్ద వార్త కాదు. అందులో సంచలనం ఏముంది. శతృసైనికులు కరకు గుళ్లు తగిలి నేలకొరిగారు అంతేగా … అందులో రసవత్తరమైన క్రైమ్ ఏమీ లేదు గా… మసాలా అంతకన్నా లేదు… అందమైన భార్య మొగుడిని చంపితేనో… ఎవరో దుర్మార్గుడు అందమైన ఆడపిల్లను నిలువునా కాల్చేస్తేనే అప్పుడు దాని గురించి తెగ చర్చించుకుంటాం. వందల పోస్టులు పెట్టుకుంటాం… ఏ హీరోయిన్ కు ఏ హీరోతో సంబంధాలు ఉన్నాయి. ఏ హీరోగారు ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నారు ఇవీ మాకు కావాల్సిన వార్తలు. గడ్డకట్టించే చలిలో కూడా వెన్నులో వణుకు పుట్టించేలా దూసుకుని వచ్చే తుపాకీ గుండ్లకు ఎంత మంది పోతే మాకేం…
మేము కట్టే టాక్స్ లతో కదా మీరు జీతాలు తీసుకుంటోంది. మేము చేసినట్టే మీరు ఉధ్యోగం చేస్తున్నారు. జీతం కోసం మేము నగరాల్లో పనిచేస్తుంటే మీరు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అంతే కదా… ఎక్కడ పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది. ఎక్కడ ఇళ్ల స్థలాలు కొంటే రాత్రికి రాత్రి కోటీశ్వరుం కావచ్చు అనేదే మా ఆలోచన. మాకు కావాల్సింది అవే… సరిహద్దులో జవాన్లు, గ్రామాల్లో రైతులు, పట్టణాల్లో పేదలు ఎవరెటు పోతే మాటేంటి ఎవరెట్లా చస్తే మాకేంటి… మేము మాత్రం అర్థరాత్రి దాకా అడ్డసొల్లు వాగి హాయిగా నిద్రపోతాం… సరిహద్దుల్లో కాపలాకాయడానికి వాళ్లున్నారుగా…

బి.వి.ఎల్.కే.మనోహర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *