ఉత్తమ్ ,జానాలు కూడా ఓడిపోతారంటున్న మంత్రి

కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని చాలా ఎక్కువగా అంచానా వేసుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తమని తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని అన్నారు. వాస్తవానికి వారి ఊహలకు పొంతనేలేదన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కే.జానారెడ్డి కూడా రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఆయన చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తాను ఆషామాషీగా చెప్పడం లేదని దేశంలోని ప్రముఖ సర్వే సంస్థల నివేదిక ఆధారంగానే ఈ విషయాన్ని చెస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసి తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు.