అంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ఈ దఫా విపక్షం లేకుండానే జరగనుంది. మిత్రపక్షం బీజేపీ తో పాటుగా అధికార టీడీపీ సభ్యులు మాత్రమే సమావేశాలకు హాజరు కానున్నారు. సభలో ఎటువంటి ఉధ్రిక్తత ఉండదు… ప్రభుత్వ ప్రకటనలను వ్యతిరేకించే వారే ఉండరు. మొత్తం మీద దఫా అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా సాగే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదను విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయించుకుంది. లోటస్ పాండ్ జరిగిన పార్టీ శాసనసభా పక్షం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బాయ్ కాట్ చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అధికార పక్షం ప్రలోభాలకు గురిచేసి తమ వైపు లాక్కుందని అయినా వారిపై స్పీకర్ ఎటువంటి చర్య తీసుకోనందుకు నిరసనగా సభలో పాల్గొనకుండా నిరసనకు దిగుటున్న పార్టీ ప్రకటించింది. స్పీకర్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేసినప్పటికీ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యా తీసుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ మండిపడింది.
అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయడంలో తమకు స్వర్గీయ ఎన్టీఆర్ ఆదర్శమని ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాదనే నిర్ణయిం తీసుకున్న సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. విపక్షాల గొంతు నొక్కే చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పేర్కొంది.