వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. సీబీఐ కోర్టు విచారణకు గాను వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ సీబీఐ కోర్టుకు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు ప్రధాన నిందితుడు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాకపోతే విచారణ ఆలస్యం అవుతుందనే సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసేందుకు గాను ఆరు నెలల పాటు తాను సీబీఐ కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు. పాదయాత్ర సందర్భంగా హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇబ్బందిగా ఉంటుందని ఈ నేపధ్యంలో తనకు వ్యక్తిగత హజరు నుండి మనహాయింపు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు జగన్ హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
పాదయాత్ర చేస్తూనే వారానికి ఒక్కసారి కోర్టుకు రావడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని కోర్టు ప్రశ్నించింది. ఆయన వారంలో ఒక రోజు కోర్టుకు వచ్చి మిగతా రోజుల్లో పాదయాత్ర చేసుకోవచ్చని దీని ద్వారా అతనికి ఒక రోజు విశ్రాంతి కూడా లభిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.