అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ట్రంప్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగి పోతోంది. హైదరాబాద్ లో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆమె హాజరవుతోంది. అమెకు, ఆమె భద్రతకు సంబంధించిన వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి కుతురు హోదాలో ఆమెకు కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
36 సంవత్సరాల ఇవాంక తన తండ్రికి అధికారిక సలహాదారుగా వ్యవహరించడంతో పాటుగా ట్రంప్ వ్యాపార బాధ్యతలను చూస్తున్నారు. పలు టెలివిజన్ షోలలోనూ కనిపించే ఇవాంక బహూముఖ ప్రజ్ఞాశాలిగా పేరుసంపాదించుకున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లయిన ఈమె ప్రపంచంలోని ప్రభావశీల మహిళల్లో ఒకరుగా పేరుగడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే ఇవాంక పేరు మారు మోగిపోయింది. ఆమెను ఆరాధించే వారితో పాటుగా అదే సంఖ్యలో వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. కూతురి అందచందాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే వాటిని ఏమీ పట్టించుకోకుండా ఇవాంక తండ్రి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో తనవంతు పాత్రను పోషించారు.
ట్రంప్ మొదటి భార్య, ప్రముఖ మోడల్ ఇవానా ట్రంప్ కు జన్మించిన ఇవాంక తల్లి నుండి మోడలింగ్ మెలకువలను తండ్రి నుండి వ్యాపార నిర్వహణను పుణికిపుచ్చుకుంది. తన అంద చందాలతో పాటుగా తెలివితేటలతో అమెరికాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఇవాంక అభిమానులను సంపాదించి పెట్టుకున్నారు.
ఇవాంక హైదరాబాద్ పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమె పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్ష కుటుంబపు భద్రతా వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ పోలీసులతో పాటుగా పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలు, ఎన్ ఎస్జీ కమెండోల భద్రత ఇడుమ ఇవాంక హైదరాబాద్ పర్యటన సాగనుంది.