డోక్లామ్ పై భారత్-చైనాల రాజీ…!

సిక్కింలోని డోక్లామ్ వద్ద భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్ని తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. ఈ ప్రాంతంలో భారీగా ఇరు దేశాలకు చెందిన సైనికులు ముఖీముఖీకి సిద్ధమైన నేపధ్యంలో రెండు దేశాలకు చెందిన సైనిక, ఉన్నత వర్గాలు జరిపిన చర్చల్లో పురోగతి కనిపించిది. ఇప్పటి వరకు ఎదురు బదురుగా ఉన్న సైనిక దళాలను కొద్దిగా వెనక్కి రప్పించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుండి ఇరు దేశాలకు చెందిన సైనిక దళాల వెనక్కి వస్తాయి. ఇరు దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంతో డోక్లామ్ లో నెలకొన్న తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు కాస్త సడలాయి. డోక్లామ్ వ్యవహారంలో ఇరు దేశాలు పట్టు సడలించపోవడంతో భారత్-చైనాల మధ్య మరోసారి యుద్ధమేఘాలు కమ్మకున్నాయి. భారత్ తో యుద్దానికి సైతం సిద్ధం అంటూ చైనా నేతలు, మీడియా చేసిన హెచ్చరికలను భారత్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాటుగా సమస్యాత్మక ప్రాంతాల్లోకి భారీగా సైనిక దళాలను మోహరించడంతో పరిస్థితి చేయిదాటే ప్రమాదాలు కనిపించాయి. రెండు అణు పాటవ దేశాల మధ్య తీవ్ర ఉధ్రిక్త నెలకొంది. రెండు నెలలుగా డోక్లామ్ లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇరు దేశాల నిర్ణయంతో ఇక్కడ తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
త్వరలోనే భారత్,చైనా,రష్యా,బ్రెజిల్,దక్షిణ ఆఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ సమావేశాలు చైనాలో జరగనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. బ్రిక్స్ సమావేశాలకు ముందు రెండు సభ్య దేశాల మధ్య నెలకొన్న తీవ్ర సంక్షోభం మంచిదికాదనే అభిప్రాయం సర్వత్రా నెలకొనడంతో డోక్లామ్ వ్యవహారంలో ఇరు దేశాలు కాస్త పట్టు సడలించడంతో ఉధ్రిక్తతలను సడలించేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారం. ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య పరమైన అనేక అంశాలు చర్చకు రావాల్సిన సమయంలో ఇందులో కీలక దేశాలైన భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉధ్రిక్తలు ఇతర చర్చలను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఇరు దేశాలు ఒక మెట్టు దిగి వచ్చినట్టు కనిపిస్తోంది.
పుతిన్ రాయబారం:
భారత్ -చైనా ల మధ్య పరిస్థితి మరీ తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు రష్యా అధినేత వ్యాదిమిర్ పుతన్ ఇరు దేశాల అగ్రనేతలతు నేరుగా మంతనాలు సాగించడం ద్వారా డోక్లామ్ వ్యవహారంలో ఇరు దేశాలు బెట్టు వీడినట్టు తెలుస్తోంది. భారత్-చైనా ల మధ్య యుద్ధ మేఘాలు కమ్మకోవడం వల్ల ఇరు దేశాలతో పాటుగా అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉండడంతో పుతిన్ నేరుగా భారత్-చైనా నేతలతు మంతనాలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు చెప్పినట్టు సమాచారం. పుతిన్ రాయబారాన్ని ఇరు దేశాలు బహిరంగంగా బయటకు చెప్పనప్పటికీ డోక్లామ్ సమస్య పరిష్కారంలో పుతిన్ కీలక పాత్రను పోషించినట్టు తెలుస్తోంది. చైనా ఒక వేళ భారత్ పై దాడికి దిగితే భారత్ కు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు అమెరికా సిద్దపడడం, జపాన్ కూడా భారత్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో రష్యా రంగంలోకి దిగక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. భారత్-చైనాల మధ్య ఉధ్రిక్తతలను సాకుగా చూపి అమెరికా ఈ ప్రాంతంలో పాగా వేస్తే అది తమకు ముప్పుగా భావించిన రష్యా వేగంగా పావులు కదిపింది. తమకు అత్యంత సన్నిహిత దేశమైన భారత్ కు నచ్చచెప్పడంతో పాటుగా కొత్త నేస్తం చైనాను కూడా రష్యా ఒప్పించగలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *