వరుసగా ఆరోసారి అధికార పీఠంపై బీజేపీ

గుజరాత్ గడ్డపై భారతీయ జనతాపార్టీకి ఎదురులేదని మరోసారి రుజువైంది. హోరాహోరీ పోరులో బీజేపీ వరుసగా ఆరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోబోతోంది. ఇప్పటివరకు అయిదు సార్లు అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ వరుసగా ఆరోసారి గుజరాత్ లో పాగావేయనుంది. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అప్పటి నుండి ఓటమి అంటూ ఎరగలేదు. నాటి నుండి నేటి వరకు జరిగిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తూ వచ్చింది. అయితే ఈ ధపా జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. కులాల సమీకరణలో భాగంగా గుజరాత్ లో గట్టి పట్టున్న కొన్ని వర్గాలు బీజేపీకి దూరం కావడంతో పాటుగా సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కొన్ని సీట్లు తగ్గినప్పటికీ మెజార్టీకి కావాల్సిన సీట్లను మాత్రం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.
పశ్చిమ బెంగాల్ లో వామపక్షపార్టీలు వరుసగా ఏడుసార్లు విజయం సాధించాయి. ఈ రికార్డుకు బీజేపీ గుజరాత్ కేవలం ఒక అడుగు దూరంలో నిల్చింది. పశ్చిమ బెంగాల్ లో వామపక్షకూటలి 34 సంవత్సరాల పాటు అధికారాన్ని చలాయించింది. కమ్యూనిష్టుల కంచుకోటగా చెప్పుకునే బెంగాల్ ను మమతా బెనర్జీ బద్దలు కొట్టగలిగారు. గుజరాత్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అయితే సీట్లను పెంచుకోవడంతో పాటుగా బీజేపీకి ఆ పార్టీ గట్టి పోటీని ఇవ్వగలగడం మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.