మేమేం తక్కువ కాదంటున్న యువతులు

అబ్బాయిలకి ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్న యువతులు వారితో అన్ని రంగాల్లోనూ పోటీపడుతున్నారు. మంచి విషయాల్లో పోటీ మంచిదే కానీ కొంతమంది అబ్బాయిల అవలక్షణాలను కూడా అందిపుచ్చుకుని అబ్బాయిలతో సమానంగా దూసుకునిపోతున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడాలేకుండా మందుకొట్టడం, రాత్రిళ్లు బలాదూర్ గా తిరగడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.
అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా పబ్బుల్లో మందుకొట్టి చిందులేస్తూ గబ్బులేపుతున్నారు. పోలీసుల డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో యువకులకు పోటీగా యువతులు కూడా చిక్కుతున్నారు. అర్థరాత్రి దాకా చక్కర్లు కొట్టి ఇంటికి రావడంలో యువకులతో పోటీపడతామంటున్నారు.
బార్లలలో అమ్మాయిలు కూర్చోని తాగడం మన భాగ్యనగరంలో చాలా అరుదుగానే కనిపించేది. కేవలం బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లలోని కొన్ని బార్లు, పబ్బులలోనే అమ్మాయిలు కూడా మందుకొట్టడం కనిపించేది. ఇప్పుడు జాడ్యం అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తోంది. ఉన్నత వర్గాల నుండి మధ్యతరగతికి కూడా ఇటువంటి అలవాట్లు పాకుతున్నాయి.
ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన తాగుడు అలవాట్లు అదో ఫ్యాషన్ గా నాగరికతగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది. తాగడంతో పాటుగా తాగి వాహనాలను నడపడం ఒక గొప్పగా భావించడంతో ఈ అలవాటుగా విస్తరిస్తోంది. ఇటీవల సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారంలోనూ పెద్ద సంఖ్యలో అమ్మాయిలు కూడా మత్తు మందులకు అలవాటు పడిన చేదు వాస్తవం బయటికి వచ్చింది.
సమాజంలో పొడచూస్తున్న ఈ పెడత్రోవలకు కారణాలను విశ్లేషించుకుంటే ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ప్రతీ ఒక్కరిదీ తప్పే. పిల్లలను పట్టించుకునే తీరక లేకపోవడమో లేదా అతి నమ్మకమో తెలియని తల్లిదండ్రుల నుండి చెడుగా ఉండడమే హీరోయిజంగా చూపించే సినిమాల దాకా ప్రతీ ఒక్కరు ఈ పెడధోరణులకు కారణమే.
ర్యాంకులు, మార్కులు తప్ప స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు కొరవడిని బోధన ఒకటేమిటి అన్నీ కారణాలే… అందరూ భాగస్వాములే. యువతలో ఇటుంటి పరిణామాల పట్ల మానసిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది జీవితాన్ని నెగెటివ్‌గా తీసుకుని తమను తక్కువగా భావించుకుని ఇతరులను నిందిస్తూ ఉంటారని వారు పేర్కొంటున్నారు. ఇతరులలో తప్పులను వెతుకుతూ ఉంటారని వారు విశ్లేషిస్తున్నారు.
కొంత మంది యువత జీవితాన్ని కాలక్షేపంగా తీసుకుని మద్యపానం, ధూమపానం చేస్తూ, జూదాన్ని ఆశ్రయిస్తూ కాలం గడుపుతూ ఉంటారని మానసిక విశ్లేషకులు చెప్తున్నారు. ఇవి చెడు అలవాట్లు మాత్రమే కాదు ప్రమాదకరమైనవి కూడా అని దీని వల్ల వారితో పాటుగా సమాజం కూడా నాశనం అవుతుందని మరికొంత మంది కూడా ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. తాగుడు వల్ల వారితో పాటుగా ఇతరులు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారు నాశనం కావడంతో పాటుగా ఇతరుల జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు.
తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు.. విలాసాలుంటే చాలనుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ విలాసాలే వ్యసనాలకు దారి తీస్తున్నాయి. తద్వారా యువతను నేరాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. మాదక ద్రవ్యాలు తీసుకోవడం కొందరికి ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇవి ప్రాణాంతకమని తెలిసినా తాత్కాలిక ఆనందం కోసం యువత దీనికి బానిసవుతోంది.
సామాజిక సమస్య
india