ప్లెక్సీలపై జీహెచ్ఎంసీ యుద్ధం

హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. అనధికారికంగా కట్టిన ఫ్లెక్సీలను, హోర్డింగ్ లను తొలగిస్తున్నారు.   డీఫేస్‌మెంట్ యాక్టు లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసే బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, విగ్రహాలు, పోస్టర్లను జిహెచ్‌ఎంసి ఈ నెల 1వ తేదీ నుంచి నిషేధించింది. గడిచిన మూడురోజుల్లో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించగా, మరికొన్ని కోట్ల వీటిని ఏర్పాటు చేసిన వారికి హెచ్చరికలు జారీ చేసిన జిహెచ్‌ఎంసి వీటి తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టింది. నగర సుందరీకరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రత్యేక చర్యలను బుధవారం మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గడిచిన కేవలం మూడు రోజుల్లో 7లక్షల 5వేల 400 అక్రమ బ్యానర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, కటౌట్లును తొలగించినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. అలాగే  స్పెషల్ డ్రైవల్ 15వేల కటౌట్లు, 47వేల ఫ్లెక్సీలు, 98వేల 850 బ్యానర్ల, లక్షా 20వేల 545 పోస్టర్లను తొలగించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా 138 అనుమతుల్లేని అక్రమ హోర్డింగ్‌లను కూడా తొలగించినట్లు వెల్లడించారు. దీంతో పాటు ఇప్పటికే పలు సార్లు హెచ్చరించినా ఖాతరు చేయకుండా వరుసగా డీఫేస్‌మెంట్ యాక్టు ఉల్లంఘనలకు పాల్పడుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన 23 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటి ప్రచార సామాగ్రిని తొలగించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. ఈ బృందాల్లోని సభ్యులకు వీటిని గుర్తించటం, నోటీసులు జారీ చేయటం, తొలగించటం, అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేయటం వంటి వేర్వేరు బాధ్యతలను అప్పగించారు. సర్కిళ్ల స్థాయిలో జిహెచ్‌ఎంసి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంటును ఏర్పాటు చేసింది. వీటి నిషేధంపై ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేయటం, ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉండటంతో ఇదివరకే పలు సార్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన జిహెచ్‌ఎంసి ఈ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *