నా వెనక ఎవరూ లేరంటున్న గజల్ శ్రీనివాస్ బాధితురాలు

గజల్ శ్రీనివాస్ అనైతిక కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచిన బాధితురాలు కొన్ని వర్గాల నుండి తనకు ఎదురవుతున్న ప్రశ్నలకు ఘాటుగా సమాధనం చెప్పింది. తాను అనేక కష్టాలు పడి శ్రీనివాస్ చేస్తున్న వ్యవహారాన్ని బట్టబయలు చేస్తే తన వెనక ఎవరు ఉన్నారు. ఎవరు చేయించారు. ఎందుకు చేయించారు అని ప్రశ్నిస్తున్నారని గజల్ శ్రీనివాస్ చేసిన దారుణాలు వారికి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నిస్తోంది. తన వెనక ఎవరు లేరని తాను ఒంటరిగానే గజల్ అకృత్యాలను ప్రజల ముందుకు ఉంచడానికి ప్రయత్నించినట్టు చెప్తోంది. ఆన్ లైన్ లో తాను కెమేరాను కొనుగోలు చేసినట్టు ఆమె వివరించింది. దాదాపు వారం రోజుల పాటు రికార్డు చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఆ తరవాత కొలిక్కి వచ్చాయని సదరు మహిళ చెప్తోంది.
రూంలో కెమేరా పెట్టిన తరువాత చాలా సార్లు రికార్డు కాలేదని అనేక సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని అంటోంది. తాను ఉద్యోగం మాని వెళ్లడానికి కూడా సిద్దపడినా తనకు జీవితం లేకుండా చేస్తానని గజల్ శ్రీనివాస్ హెచ్చరించాడని అంటోంది. అనేక మంది మహిళలను ఇబ్బందులకు గురిచేసిన శ్రీనివాస్ అకృత్యాలను బయట పెట్టేందుకే తాను ఇంతటి సాహసం చేశానని అంటోంది. ఇంకే మహిళకు అన్యాయం జరక్కుండా ఉండేందుకే తాను ప్రయత్నించినట్టు చెప్తోంది. అయితే తనపై కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తనను కించపర్చే విధంగా ప్రవర్తిస్తున్నారని అంటోంది. తన వెనకు ఎవరూ లేరని మరోసారి స్పష్టం చేసింది.
సహాయం కోసం పోలీసుల వద్దకు వెళ్లిన వెంటనే వారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని తనకు అన్నివిధాలుగా అండగా ఉన్నారని చెప్పింది. పోలీసుల కు తాను రుణపడి ఉంటానని ఆమె చెప్తోంది. తాను డిసెంబర్ 29వ తేదీన అన్ని ఆధారతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్తున్న ఆమె వారు సమగ్రంగా వివరాలు సేకరించిన తరువాతనే గజల్ శ్రీనివాస్ ను అరెస్టు చేశారని అంటోంది. తనను కూతురు లాగా చూసుకున్నానని చెప్తున్న శ్రీనివాస్ నిజంగా తను అట్లా చూసుకని ఉంటే తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం వచ్చేది కాదని అంటోంది. ఎవరైన కూతురితో అంత దారుణంగా వ్యవహరిస్తారా అని ఆమె ప్రశ్నిస్తోంది.