అమెరికాలోని స్కూల్లో కాల్పులు 17 మంది మృతి-14 మందికి గాయాలు

అమెరికాలో తుపాకుల సంస్కృతి 17 మంది ప్రాణాలను బలితీసుకుంది. పాఠశాలలో ఒక యువకుడు జరిపిన కాల్పుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెల్సుతోంది. ఫ్లోరిడా లోని పార్క్ ల్యాండ్ లోని మర్జోరి స్టోన్ మన్ డగ్లస్ పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలోకి చొచ్చుకుని వచ్చిన పూర్వపు విద్యార్థి నికోలస్ క్రూజ్ (19) విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విగతజీవులుగా మారారు. వీరిలో విద్యార్ధులతో పాటుగా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కాల్పులకు తెగబడడ్డ దుండగుడు కూడా ఇదే పాఠశాలలో చదువుకున్న విద్యార్థి కావడం గమనార్హం.
చెడు తిరుగుళ్లకు, స్నేహాలకు అలవాటు పడ్డ నికోలస్ ను పాఠశాల యాజమాన్యం ఇటీవల చెడు ప్రవర్తన కారణంగా సస్పెండ్ చేసింది. దీన్ని మనసులో పెట్టుకున్న సదరు యువకుడు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు తెగపడ్డాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని కాల్చిచంపిన తరువాత పాఠశాల గేట్ వద్దే నక్కిన దుండగుడు బయటకు వచ్చిన విద్యార్థులకుపైకి కాల్పులు జరిపాడు. దీనితో అక్కడ బీతావాహ వాతావరణం ఏర్పడింది. కాల్పుల్లో మరణించిన, గాయపడ్డ వారితో అక్కడ పరిస్థితి దారుణంగా తయారయింది.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న తరువాత పాఠశాల భవనంలోకి పారిపోయిన నికోలస్ వారిపై కూడా కాల్పులు జరిపాడు.పోలీసులు ఎదురు కాల్పులు జరుపుతూ నికోలస్ ను బంధించారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కళ్ల ఎదుటే కాల్పులు జరగడంతో పాఠశాలలోని విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *