అగ్గిపెట్టెలతో బాలుడి ఆటలు-తగలబడిన ఇల్లు

అగ్గిపెట్టెలతో పిల్లలు ఆడుకోవడం అంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే. అగ్గిపుల్లలు గీసి ఆడుకుంటున్న ఓ బాలుడి వల్ల ఇల్లు కాలిపోగా బాలుడికి కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటన విజయవాడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడలోని సింగ్ నగర్ లో తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో బాలుడు ఒక్కడే ఉన్నాడు. 9 సంవత్సరాల బాలుడు అందుబాటులో ఉన్న అగ్గిపెట్టలతో ఆడుకుంటున్న క్రమంలో పెట్టేలోని పుల్లలన్నీ ఒకేసారి అంటుకోవడంతో భయంతో వాటిని మంచంపైకి విసిరేశాడు. దీనితో మంటలు ఎగిసిపడడంతో బాలుడు భయంతో కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు వచ్చి బాలుడిని కాపాడారు. అయితే మంటలు అప్పటికే ఎక్కువగా రావడంతో ఇంట్లో సామాగ్రీ మాత్రం కాలిపోయింది.
ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇంట్లోని వస్తువులు కాలిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. బాలుడికి కూడా గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ముఖంతో పాటుగా చెవులు,చేతులు కూడా కాలాయి. అయితే ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్తున్నారు.