తెలంగాణాలో కాంగ్రెస్ మనుగడ కష్టమేనా…?

0
52

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం గాలిలో దీపం మాదిరిగా తయారైంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోతే ఉన్న కొద్దిపాటి పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీకి దూరం అయిపోతారనే బెంగ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పైకి ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ అంతర్గత చర్చల్లో హస్తం గుర్తు పార్టీ నేతలు లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కలవరపడుతున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను 15కు పైగా సాధిస్తామని పైకి చెప్తున్నా లోపల మాత్రం ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఖచ్చితంగా ఒక అంచానాకు రాలేకపోతున్నారు. రాష్ట్రంతో పాటుగా కేంద్రంలోనూ పార్టీకి అనుకూల ఫలితాలు రాకుండా ఇక పార్టీని నడిపించడం కష్టమనే స్థాయికి పార్టీ వర్గాలు చేరుకున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారంలోకి వస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఆ పార్టీనేతలు తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఫలితాలు పార్టీ నేతలు ఆశించిన దానికి పూర్తిగా భిన్నంగా రావడంతో ఒక్కసారిగా ఖంగుతున్నారు. కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా అసెంబ్లీ సీట్లు రాకపోడంతో పార్టీ వర్గాలు డీలా పడ్డాయి. టీఆర్ఎస్ ప్రభంజాన్ని తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తీగా డీగాపడిపోయింది. గెల్చిన ఎమ్మెల్యేలు కూడా అధికార్టీ గూటికి చేరిపోవడంతో పార్టీలో ఎక్కడా జోష్ కనిపించడం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి గెలవడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఎడారిలో ఒయాసిస్సులాగా కనిపించినా లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో జవసత్వాలు నింపుకోవడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. తెలంగాణలో రాజకీయంగా పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్న టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ లో కనిపించడం లేదు. నాయకత్వ లేమి ఆ పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటారనుకున్న నేతలు ఒకొరొక్కరుగా పార్టీని వదిలి పోయారు. ఉన్న నేతలు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోవడం మినహా పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సామాన్య కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మల్కాజ్ గిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్ , మహబూబా బాద్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. వీటిని గెల్చుకుని తీరాతామంటూ చెప్తోంది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వీటిలో కనీసం మూడు నుండి నాలుగు స్థానాలు గెల్చుకున్నా రాష్ట్రంలో తల ఎత్తుకునే స్థాయిలో పార్టీ ఉంటుందని లేకుంటే మాత్రం పార్టీ మనుగడే ప్రశ్నర్థకంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని 17 సీట్లకు గాను 16 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ గట్టిగా చెబుతుండడం కూడా హస్తం పార్టీ నేతలను మరింత కలవరానికి గురిచేస్తోంది. ఏ ఒక్క స్థానం లో అయినా ఖచ్చితంగా గెలిచి తీరుతామనే భరోసా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. లోక్ సభ ఫలితాల్లో కొన్ని సీట్లయినా సాధించి పరువు నిలుపుపోలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు మే23 ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Wanna Share it with loved ones?