ప్రాణాలు తీస్తున్న అబద్దపు ప్రచారాలు

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. దొంగల ముఠాలు ప్రవేశించాయని అదను చూసుకుని దొంగతనాలకు తెగబడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనితోపాటుగా చిల్లపిల్లలను కిడ్నాప్ చేస్తున్నరని దొంగతనాలు చేసే క్రమంలో అడ్డువచ్చినవారిని కిరాతంగా మట్టుపెట్టేందుకు కూడా వెనుకాడడంలేదనే అబద్దపు ప్రచారాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గ్రామాలు,పట్టణాల్లో కొత్తగా కనిపించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. దొంగలనే అనుమానంతో ప్రజలు జరిపిన దాడుల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోగా మరికొంతమంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.
అబద్దపు ప్రచారాలు చేయవద్దని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. ఇటువంటి ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికులు చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. ఇంకా దొంగల ముఠాలకు సంబంధించిన వార్తలు వాట్సప్ , ఫేస్ బుక్ లలో విచ్చలవిడిగా ప్రచారం అవుతూనే ఉన్నాయి. తెలిసీ తెలియక జరుగుతున్న ప్రచారంతో కొందరు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతోంది. కొన్ని పాత వీడియోలు ఇప్పుడు హఠాత్తుగా వైరల్ అయ్యాయి. దోపిడీ దొంగల భయంలో భయాందోళనలో ఉన్న ప్రజలు ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా దాడులు చేస్తున్నారు. ముందు వెనకా చూడకుండా చితక్కొడుతున్నారు.
అనుమాస్పద వ్యక్తులు తారసపడితే తమకు సమాచారం అందించాలని ఎవరిపైనా దాడులు చేయవద్దని పోలీసులు చెప్తున్నా అవి ఏమాత్రం ప్రజల చెవికి ఎక్కడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు రావడంలో జరుగుతున్న ఆలస్యం, కొంతమంది అత్యుత్సాహం చివరకు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. వివిధ పనులమీద గ్రామాలకి వస్తున్న ఇతర ప్రాంతాలకి చెందినవారు, మానసిక పరిస్థితి సరిగాలేని వారు, మధ్యం మత్తులో సంచరిస్తున్నవారు దాడులకు గురవుతున్నారు. స్థానికులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో ఒక్కసాిరిగా వారిపై దాడికి తెగబడుతున్నారు.
గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ముఠాలు తిరగడం లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసు బాసులు హెచ్చరిస్తున్నారు. అమాయకులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల్లోని ఏదో ఒక మూల దాడులు జరుగుతూనే ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండమంటూ చేసిన ప్రచారం కూడా ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. పార్థీ ముఠాతో పాటుగా మరికొన్ని దొంగల ముఠాలు సంచరిస్తున్నాయని వాటికి సంబంధించిన వివరాలు తమకు చెప్పాలంటూ కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. పోలీసులు ముందుజాగ్రత్తగా చేసిన ప్రచారాన్ని తప్పుగా అన్వయించడంతో అతికాస్త పరిస్థితి అదుపుతప్పే స్థాయికి చేరుకుంది. కొంత మంది పనిగట్టుకుని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవిధంగా ప్రచారం చేయడంతో మరింత బెదిరిపోయిన ప్రజలు ప్రతీ ఒక్కరినీ అనుమానంతోనే చూడడం మొదలు పెట్టారు. ఫలితంగా ఎవరు సరిగా సమాధానాలు చెప్పకున్నా వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఏమీ తెలియని అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అబద్దాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.
http://www.telanganaheadlines.in/police-warning/నిపా వైరస్ పై ఆందోళన వద్దంటున్న ప్రభుత్వం
India