పౌరసరఫరాలో 'అనందమయం'

అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన పౌరసరఫరాలశాఖను ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో ఐఏఎస్‌ అధికారులే పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా కొనసాగే సాంప్రదాయాన్ని పక్కకుపెట్టి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సి.వి.ఆనంద్‌ను 2016, ఆగస్టు 20న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వ నియమించింది.
ముఖ్యమంత్రి అంచనాలకు ధీటుగా 17 నెలల కాలంలో పౌరసరఫరాలశాఖలో ఎన్నో సంస్కరణలతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సి.వి.ఆనంద్‌ అవినీతికి అడ్డుకట్ట వేయడమే కాకుండా శాఖలో సమూల మార్పులు చేపట్టారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘ఎక్స్‌లెన్స్‌’ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును గత ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా స్వీకరించారు.
పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనను వినూత్న చర్యలతో నిరాడంబరంగా, సమర్థంగా, శక్తిమంతంగా, సంపూర్ణంగా, పారదర్శకంగా, అధునాతనంగా చేపట్టారు. సీఎంఆర్‌, ఐటీ, ధాన్యం కొనుగోలు, చెల్లింపులు, టెండర్ల నిర్వహణపై తనదైన ముద్రవేశారు. కొత్త జిల్లాలు ఏర్పాడిన సందర్భంలో కౌన్సిలింగ్‌ ద్వారా ఉద్యోగుల బదిలీలు చేపట్టారు. దీర్ఘకాలంగా హైదరాబాద్‌లో తిష్టవేసిన అధికారులకు స్థానచలనం కల్పించారు. పారదర్శకత, జవాబుదారీతనం, రికవరీలు, పొదుపు చర్యలు, ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సత్వర ఫలితాలే లక్ష్యంగా చేపట్టిన సంస్కరణలతో 17నెలల కాలంలో ఏకంగా రూ.1800 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేయడమే కాకుండా శాఖను పూర్తిగా గాడిలో పెట్టారు.
ముఖ్యంగా సాంకేతికతకు పెద్దపీట వేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పూర్తిగా నిఘా నీడన సరుకులు పంపిణీ జరిగేలా చేపట్టిన చర్యలతో సబ్సిడీ సరుకులు దారిమల్లే అవకాశం లేకుండా పోయింది. స్టాక్‌పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, సరుకులను తరలించే లారీలకు జీపీఎస్‌, చౌకధరల దుకాణాల్లో ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సెల్‌ (ఈపాస్‌) బయోమెట్రిక్‌ ఇలా రేషన్‌ లబ్ధిదారుడికి చేరేవరకు ప్రతీ అడుగూ నిఘానీడన సాగేలా చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలనిచ్చాయి. 17,200 రేషన్‌ షాపుల్లో ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ స్కేల్‌ యంత్రం ఏర్పాటు చేసి దశాబ్దాలుగా జరుగుతున్న తూకంలో మోసాలకు ముగింపు పలికారు.
రిటైర్డ్‌ పోలీసు అధికారులతో నిఘా బృందాలను ఏర్పాటు చేసి రేషన్‌ బియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న 4గురు వ్యాపారులపై పీడీ కేసులు నమోదు చేశారు. పంపిణీలో పారదర్శకత ఉండాలనే లక్ష్యంతో ఏ కార్డుదారుడు సరుకులు ఎప్పుడు తీసుకున్నాడు, ఎన్ని సరుకులు తీసుకున్నాడు, రేషన్‌షాపులో సరుకుల నిల్వలు, షాపు తెరిచి ఉందా, ముసి ఉందా… రేషన్‌ షాపు లోకేషన్‌ వంటి విషయాలను ఆన్‌లైన్‌లో సామన్య ప్రజలకు సైతం తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట పడింది.
ఆధునిక సాంకేతికతతో రేషన్‌ బియ్యం అక్రమాలకు చాలామేరకు అడ్డుకట్ట వేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు తర్వాత కాకినాడ పోర్టుకు అక్రమంగా బియ్యం తరలింపు చాలా వరకు తగ్గుముఖం పట్టింది. రైతులకు ఆన్‌లైన్‌ చెల్లింపులు వంటి విషయాల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిపారు. ఇతర రాష్ట్రాల పౌరసరఫరాలశాఖ మంత్రులు, కార్యదర్శులు స్వయంగా పౌరసరఫరాలశాఖ చేపట్టిన ఐటి ప్రాజెక్టులను అధ్యాయనం చేశారు. మరీ ముఖ్యంగా మిల్లర్లనుండి బియ్యం సేకరణ(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) విషయంలో రికార్డు సృష్టించారు. టెండర్ల విధానం గతంలో లోపభూయిష్టంగా ఉండేది.పారదర్శకంగా టెండర్ల విధానాన్ని ప్రవేశపెట్టి టెండర్లల్లో అవకతవకలను అరికట్టారు. ‘పోలీస్‌ బాస్‌ ప్రయోగం’ విజయవంతమవడం ద్వారా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేనని భావన అధికారవర్గాలు, ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ప్రతి విషయంలోనూ సమస్యపై పైస్థాయి నుండి క్రిందిస్థాయి వరకు అధికారులతో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. పౌరసరఫరాలభవన్‌లోని ప్రతి విభాగాన్ని పలుమార్లు సందర్శించారు. ఉద్యోగస్తుల మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. వారితో చాలా స్నేహాంగా మెలిగేవారు. ఆనంద్‌ కేంద్ర సర్వీసులకు వెళ్తున్న వార్త పౌరసరఫరాల ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థను తనదైన నిర్ణయాలతో ఒక్క గాడిన పెట్టారు. ఇంకోంతకాలం ఉంటే పౌరసరఫరాల సంస్థ ఆర్థికపరిస్థితి మరింత మెరుగుపడుతుండేదని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. నిబద్ధత, నిజాయితీగా పనిచేస్తే కమిషనర్‌ ఆనంద్‌గారి దగ్గర ఎంతో బాగా పనిచేయవచ్చని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. పౌరసరఫరాల అధికారులు, సిబ్బంది తలెత్తుకుని తిరిగేలా పౌరసరఫరాల శాఖ పేరు ప్రతిష్ఠలను ఇనుమడింపచేశారు.
కమిషనర్‌ ఆనంద్‌ చేపట్టిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ ద్వారా కనీస మద్దతు ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు, చెల్లింపుల విధానంగా (ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సిస్టం) అత్యంత ప్రాచుర్యం పొందింది. ఏడాది కాలంలో 11 లక్షల మంది రైతులకు 8000 కోట్ల రూపాయలు ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా చెల్లించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. జిల్లాలలకు, కేంద్ర కార్యాలయం అధికారులు, సిబ్బంది జిల్లా కార్యాలయాలకు వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటుతో సమన్వయం ఏర్పడడం వల్ల మంచి ఫలితాలు సాధించారు.
2017, మే 19న హెచ్‌.ఐ.సి.సి., హైదరాబాద్‌లో జరిగిన
పోలీసు అధికారుల సమావేశంలో
ముఖ్యమంతి శ్రీ కె.సి.ఆర్‌. గారి పస్రంగం…
కమిషనర్‌ సీ.వీ. ఆనంద్‌ పనితీరుకు నిదర్శనం
”ఇక డెఫినెట్లి సైబరాబాద్‌ కమిషనర్‌ ఆనంద్‌ గారు, మహేందర్‌రెడ్డి గారు వారి కంట్రిబ్యూషన్‌ ఎంత బాగా పోయింది. పజ్రలు ఎంత బాగా పాజిటివ్‌ తీసుకుంటాన్నారనేది మనం దాన్ని బట్టి అవగాహన చేసుకోవచ్చు.
అందువల్లనే ఈరోజు ఆనంద్‌ గారు నేను సెంట్రల్‌ సర్వీసెస్‌కు వెళ్తానంటే వారి యొక్క పర్ఫార్మెన్స్‌ బేస్‌ చేసి, పర్ఫార్మెన్స్‌ చూసి ఐ పర్సనల్లీ రిక్వెస్టెడ్‌ హిమ్‌. మీరు పోలీసు ఆఫీసర్‌ అయినా సరే, మీ యొక్క బ్యూటిఫుల్‌, మీ వర్క్‌ మైండ్‌షిప్‌ మీద నాకు విశ్వాసం ఏర్పడింది. కాబట్టి దయచేసి సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌లో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి, కాబట్టి మీరు నాకు ఇక్కడ ఎంతసేపు ఉంటారో, ఎన్ని నెలలు ఉంటారో అన్ని నెలలు అక్కడ ఎం.డి.గా పనిచేసి రిజల్ట్స్‌ తెచ్చివ్వమంటే, హీ యాజ్‌ ప్రొడ్యూస్డ్‌ ఎక్సలెంట్‌ రిజల్ట్స్‌. డికేడ్స్‌ టుగెదర్‌ రాని, రానటువంటి రిజల్ట్స్‌, ఐ రియల్లీ అప్రిషియ్టేట్‌ సి.వి. ఆనంద్‌. ఒక 850 కోట్ల రూపాయలు గవర్నమెంట్‌కు ఆదా చేసి, అక్కడ ఉన్న దుర్మార్గాలను చాలావరకు ప్రక్షాళన చేసి, బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్‌ ఇచ్చారు.
ఇక్కడ మీరు చాలా సెక్టార్‌లలో పనిచేస్తా ఉన్నారు. ఒక పోలీసే కాదు, పోలీసు ఆఫీసర్స్‌ గివెన్‌ ఎ టాస్క్‌. సిచ్యువెషన్‌ ఇస్తే, ఒక టాస్క్‌ ఇస్తే అద్భుతంగా పనిచేయగలమని చెప్పి మాకు టాలెంట్‌ ఉందని చెప్పి, రుజువు చేస్తా ఉన్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనం మన ఇంతకు ముందు సైబరాబాద్‌ కమిషనర్‌, ఇప్పుడు సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎం.డి. మిస్టర్‌ సి.వి. ఆనంద్‌.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *