విపక్షాలకు దొరికి కాగ్ రిపోర్టు అయుధం|cag report

0
58
కాగ్ రిపోర్టు
cag report

కాగ్ రిపోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో విపక్షాలకు గొప్ప అవకాశం లభించినట్టయింది. దీన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి దాన్ని ఆదాయంగా చూపుతోందని వారు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ లోటును కప్పిపుచ్చి రెవెన్యూ మిగులుగా చూపించడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వపు డొల్లతనాన్ని కాగ్ బట్టబయలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రభుత్వం పైన పటారం లోన లొటారం అన్న చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తాము చాలా కాలంగా ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుని పోయిందని చెప్తునే ఉన్నామని ఇప్పుడు తాము చెప్పిన మాటలనే కాగ్ రిపోర్టు లో కూడా వచ్చిందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వం పెద్ద ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టు ద్వారా వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలిశాయని అన్నారు. నాలుగు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రకాలుగా నాశనం అయిందని ఆయన ఆరోపించారు. అప్పులను ఆదాయంగా చూపించిన ఘనత తెలంగాణ రాష్ట్ర సర్కారుదేనని ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని చెప్పారు.
కాగ్ రిపోర్టు లో వాస్తవాలు బయటికి వచ్చిన తరువాత కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కును టీఆర్ఎస్ సర్కారు కోల్పోయిందని శ్రవణ్ అన్నారు. ముఖ్యమంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను మోసగించిన ప్రభుత్వం ఏ విధంగా అధికారంలో కొనసాగుతుందని ఆయన ప్రశ్నించారు. అత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోందని దుయ్యబట్టారు.
కాగ్ నివేదిక వల్ల వాస్తవాలు బయటికి వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తోందనే విషయాన్ని తాను ముందుగానే చెప్తే తనను ఎద్దేవా చేశారని మరి కాగ్ నివేదిక వచ్చినతరువాత ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఇన్నాళ్లు ప్రజలను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ లేవనే విషయాన్ని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని లక్ష్మణ్ అన్నారు.
ప్రభుత్వమే ప్రజలను మోసం చేయడం దారుణమని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై ప్రకటన చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యవహారం మేడిపండు చందంగా ఉందన్నారు.
CAG Report. State revenue surplus, surplus overstated, irregular accounting,revenue deficit, revenue surplus, CAG report,revenue surplus.


Wanna Share it with loved ones?