కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమేనా?

కాంగ్రెస్ ముఖ్త భారత్… ప్రధాని నరేంద్ర మోడీ నినాదం ఇది. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా గొయ్యితీసి పాతేయలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మోడికి గుజరాత్ ఎన్నికల ఫలితాలు గట్టి ఎదురుదెబ్బ తీశాయి. గుజరాత్ లో అధికార పీఠం దక్కించుకున్న బీజేపీ కంటే ఓడిన కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ ఆనందంలో ఉన్నట్టు కనిపిస్తోంది. కాషయపార్టీకి గట్టి పట్టున్న గుజరాత్ లో కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చింది. అధికార పార్టీకి ముచ్చెమటలు పోయించడంలో రాహుల్ గాంధీ సఫలం అయ్యాడు. మోడిని తట్టుకునే స్థాయి కానీ స్థైర్యం కానీ రాహుల్ కు లేదని, ఆయన్ని ముద్దపప్పుగా పేర్కొనే బీజేపీ నేతలకు సైతం రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో అనుసరించిన వ్యాహాలు ఎత్తుగడలు ఆశ్చర్యపర్చాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 150 సీట్లను సాధించడం ద్వారా కాంగ్రెస్ ను భారీ దెబ్బకొట్టాలనుకున్న బీజేపీ పాచిక పారలేదు సరికదా 100 స్థానాల మార్క్ ను కూడా చేరుకోలేకపోయింది.
గుజరాత్ లో గెలవడానికి బీజేపీ శర్వశక్తులను ఒడ్డింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ అడుగడుగునా తాను దేశానికి ప్రధానిని అయినా మీవాడిని అని చెప్పే ప్రయత్నం చేశాడు. చివరికి తన హత్యకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నారంటూ సింపతీని కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు. తనను ఓడించేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగిందనే ప్రచారం కూడా చేసిన మోడి ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నా కాంగ్రెస్ పక్కలో బల్లెంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని బట్టి చూస్తే అది 14 నుండి 15 లోక్ సభ సీట్లకు సమానంగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి కాంగ్రెస్ బలం గుజరాత్ లో గణనీయంగా పెరిగిందనే సంగతిని బీజేపీ ఒప్పుకోక తప్పదు.
సెమీ ఫైనల్స్ గా చెప్పుకునే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. కీలకమైన కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లతో పాటుగా ఈశాన్య రాష్ట్రాలు మిజోరం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలాబలాలను పరిశీలిస్తే గుజరాత్ కన్నా ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ప్రబల శక్తిగా ఎదిగి 350 సీట్ల మార్క్ ను చేరుకోవాలని బీజేపీ పెద్దతలకాయలు ఆశ పడుతున్నాయి. ఈ క్రమంలో తమకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ ను బలహీనపర్చేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు పంజాబ్, కర్ణాటక మినహా ఏవీ లేదు. వచ్చే సంవత్సరం కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తిరిగి అధికారాన్ని నిలుపుకోగలదో చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయలనుకునే మోడీ కలలు మాత్రం ఇప్పట్లో నెరవేరే సూచనలు కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *