కర్ణాటకలో పోరాడి గెల్చిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పింది. దేశ రాజకీయాల్లో కొన్ని రోజులుగా తిరోగమనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే కర్ణాటక వ్యవహారంలో హస్తం నేతలు చురుగ్గా వ్యవహరించి చావుదెబ్బతగలకుండా కాపాడుకోగలిగారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరుగున పడిపోయిందని, ఇక ఆ పార్టీ పనయిపోయిందనే తరుణంలో కర్ణాటక వ్యవహారంలో కాంగ్రెస్ చక్రం తిప్పిన తీరు అమోఘమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నప్పటికీ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అధికారంలోకి రాకుండా దిగ్విజయంగా అడ్డుకోగలిగింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు నుండే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జాతీయ స్థాయిలో ఆశక్తిని రేపాయి. కర్ణటకలో పాగా వేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో తమ ప్రభావం చూపించడంతో పాటుగా కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ బీజేపీ ఇచ్చిన నినాదానికి ప్రజల మద్దతు లభించిందనే ప్రచారాన్ని హస్తం పార్టీ సమర్థంగా అడ్డుకోగలిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో ఆశజనకంగా ఏంలేదు. అవినీతి ఆరోపణలతో పాటుగా కర్ణాటకలో సహజంగా ఉండే అధికార పార్టీ వ్యతిరేకతతో సతమతమయింది. కన్నడ రాష్ట్రంలో బీజేపీ పాగావేయడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. బీజేపీ గెలుపు నల్లేరు మీద బండినడక అంటూ ఓ దశలో విస్తృత ప్రచారం జరిగింది.
అయితే ప్రతికూల అంశాలను తట్టుకుంటూ ముందుకెళ్లిన కాంగ్రెస్ పా్ర్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమనే స్థాయికి చేరుకుంది. లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించడం మొదలు ప్రజలు విస్తృతంగా వాగ్దానాలు చేసింది. సిద్దరామయ్యను తిరిగి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో పాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగాడు. అయితే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి 78 సీట్లతోనే సరిపుచ్చారు. ఇక్కడే ఆ పార్టీ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీకి దాదాపు మెజార్టీ ఖాయమని ఎన్నికల ఫలితాల రోజును దాదాపు అన్ని మీడియాల్లో వార్తలు వచ్చినప్పటికీ వాస్తవపరిస్థితులను అంచానావేసుకుంటూ వచ్చిన కాంగీయులు వేగంగా పావులు కదిపింది.
ఎప్పుడైతే రాష్ట్రంలో హంగ్ ఏర్పడడం ఖాయమని తేలిపోయిందో అప్పుడే కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహరించింది. ఎన్నికల ఫలితాల నాటికే తమ పార్టీ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, అకోశ్ గెహ్లాట్ లను బెంగళూరులో మకాం వేసించిన కాంగీయులు పార్టీ తన సహజశైలికి భిన్నంగా అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంది. జేడీఎస్ తో పొత్తుకు సిద్ధమని ప్రకటించడంతో పాటుగా ఆ పార్టీ నేత కుమార స్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది. దీనితో బీజేపీ ఒక్కసారిగా ఖంగుతినాల్సి వచ్చింది. జేడీఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయద్దామనుకున్న బీజేపీ ఆశలకు గండిపడింది. కాంగ్రెస్ ఏకంగా సీఎం పదవిని ఇచ్చేందుకు సిద్ధపడడంతో కుమారస్వామి కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు.
అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము జేడీఎస్ కు మద్దతు ఇస్తున్నట్టు లిఖితపూర్వకంగా గవర్నర్ కు లేఖ అందించడం ద్వారా ఒక అడుగు ముందుకు వేసింది. అయితే గవర్నర్ కాంగ్రెస్-జీడేఎస్ ల కూటమిని కాదని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో అర్థరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. దీని కోసం గాను కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే తమ పార్టీకి చెందిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబాల్, పి. చిదంబరం లాంటి ఉద్దండులను రంగంలోకి దింపింది. దీనికోసం పార్టీ పెద్దలు ముందుగానే వ్యూహ రచన చేసినట్టు సమాచారం.
సుప్రీంకోర్టు యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి అడ్డుచెప్పనప్పటికీ మెజార్టీ నిరూపరణ కోసం గవర్నర్ ఇచ్చిన సమయాన్ని తగ్గించడంతో బీజేపీ ఖంగు తినాల్సివచ్చింది. ఒక వైపు ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తూనే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా మత్తతు కూడగట్టే పనిలో పడింది. రాజకీయ పక్షాలతో పాటుగా ప్రజల సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తూ గోవా,మణిపూర్, మేఘాలయ ఉదంతాలను తెరపైకి తీసుకుని వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు గవర్నర్ లు అనుమతి ఇచ్చారంటూ ప్రచారం చేయడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చింది. బీజేపీ బేరసారాలకు పాల్పడుతోందని అంటూ దానికి ఆధారాలు కూడా బయటపెట్టడంతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. గాలిజనార్థన్ రెడ్డి తోపాటుగా సాక్షాత్తూ యడ్యూరప్పే బేరసారాలు జరపుతున్నట్టు ఆడియోలు విడుదల చేయడం ద్వారా బీజేపి చర్యలను ప్రపంచం ముందు ఉంచగలిగింది.
తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వారిని హైదరాబాద్ కు ఆఘమేఘాల మీదతరలించడం ద్వారా తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంది. తమ ఎమ్మెల్యేలను తరలించే క్రమంగా తమకు రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ, టీఆర్ఎస్ అధినేతలతో మంతనాలు సాగించింది.
మొత్తం మీద అన్ని రకాల వ్యూహాలు అమలుపర్చిన కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగింది. గోవా, మణిపూర్ లలో రాజకీయ వ్యూహాల్లో చిరుకుదనం లేకపోవడం వల్ల చతికిలపడ్డ కాంగ్రెస్ ఆ మచ్చను చెరిపోసుకుని కర్ణటకలో తన వ్యూహాలను జాగ్రత్తగా అమలుపర్చడంలో సఫలం అయింది.

యడ్యూరప్ప తో రాజీనామా-బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం


యడ్యూరప్ప రాజీనామా
Karnataka_Congress_Party