చాందినినీ చంపింది స్నేహితుడే

సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మియాపూర్ మదీనా గూడకు చెందిన చాందీనీ జైన్ నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి కుమారై. ఈనెల 9న స్నేహితులను కలసి వస్తానంటూ ఇంటి నుండి వెళ్లిన అమీన్ పూర్ గుట్టల్లో శవమై కనిపించడం సంచలనం రేపింది. ఈ కేసులో చాందినీ స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చదువుకున్న పాఠశాలలో సీనియర్ గా ఉన్న సాయికిరణ్ చాందిని జైన్ ను హత్యచేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. చాందినీ హత్యకేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు జరిపిన దర్యాప్తులో సాయికిరణ్ హత్య చేసినట్టు గుర్తించారు.
చాందినీ జైన్ హత్య కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ ద్వారా కీలక ఆధారాలు సంపాదించిన పోలీసులు సాయికిరణ్ ను అరెస్టు చేశారు. చాందినీ, సాయి కిరణ్ లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా సాయికిరణ్ పై చందిని ఒత్తిడి చేయడంతో ఆమె అడ్డుతొలగించుకునేందుకు హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన రోజున ఇద్దరూ కలిసి అమీన్ పూర్ గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారని పెళ్లి విషయంలో ఇద్దరికీ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయని చివరకు చాందినీని సాయికిరణ్ హత్య చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. సాయికిరణ్ తో కలిసి చందినీ జైన్ గుట్టల్లోకి వెళ్ళిన దృశ్యాలు సిసి కెమేరాకు చిక్కాయి. వాటి ఆధారంగా సాయికిరణ్ ను అరెస్టు చేసి ప్రశ్నించిన పోలీసులకు తానే ఈ హత్య చేసినట్టుగా సాయికిరణ్ ఒప్పుకున్నాడు. హత్యకు ముందు చాందినీ జైన్ పై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని పోలీసులు చెప్తున్నారు. సాయికిరణ్, చాందినీ జైన్ లు అమీన్ పూర్ గుట్టల్లోకి ఆటోలో వెళ్లినట్టు పోలీసులు చెప్తున్నారు. వారిని ఆటోలో అక్కడకు తీసుకుని వెళ్లిన ఆటో డ్రైవర్ కూడా సాయికిరణ్ ను గుర్తించినట్టు పోలీసులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *