మిత్రభేదం వల్ల ఎవరికి నష్టం..ఎవరకి లాభం..

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ-భారతీయ జనతా పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయి. నాలుగు సంవత్సరాలుగా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఈ రెండు పార్టీలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తెగతెంపులు చేసుకోవడం వల్ల ఎవరికి లాభం అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందనే విషయాన్ని తెలుగుదేశం గట్టిగానే ప్రజల్లోకి తీసుకుని పోగలిగింది. కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందనే ఇప్పుడు సగటు ఆంధ్రా పౌరుడు భావిస్తున్నాడు. కేంద్రం రాష్ట్రానికి భారీగా నిధులను ఇచ్చిందని బీజేపీ చేసిన ప్రచారం ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదనే చెప్పాలి. ప్రత్యేక హోదా విషయంలో ఉన్న అడ్డంకులు ఏమిటీ అన్న విషయాన్ని కూడా బీజేపీ సరిగా విడమర్చి చెప్పలేకపోవడం ఆ పార్టీకి ఏపీలో మైనస్ గా మారింది. మోడీ ఛరిష్మాతో ఏపీలో బలంగా ఎదగాలని భావించిన ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బతగిలిందనే చెప్పాలి. స్వతంగా రాష్ట్రంలో నిలదొక్కుకునే పరిస్థితులు లేకపోవడంతో ఆ పార్టీకి రానున్న రోజుల్లో ఎవరికి దగ్గరవుతుందో చూడాలి. ఇప్పటికిప్పుడు మాత్రం విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో జట్టుకట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో జట్టుకట్టినా అది పార్టీకి లాభం కన్నా ఎక్కువ నష్టమే కలిగిస్తుంది.
రానున్న రోజుల్లో బీజేపీ జనసేనకు దగ్గర అయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరిని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సమయంలో పవన్ కు చేతులు కలిపే అవకాశాలు ఏమాత్రం లేవు. దీనితో బీజేపీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయక తప్పదనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్డీఏ నుండి బయటికి వస్తున్నట్టు ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం నుండి హోదా విషయంలో మరో ప్రకటన ఏదైనా వస్తే తిరిగి బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎన్నికల తరువాత కూడా ఇటు టీడీపీ గానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంతో తనకు ఉన్న అవసరా దృష్ట్యా జగన్ బీజేపీ విషయంలో దూకుడుగా వెళ్లే అవకాశాలు పెద్దగా లేవు. ఇటు టీడీపీ కూడా గతంలో బీజేపీతో పొత్తు ఉపసంహరించుకున్న తరువాత కూడా మళ్లీ ఆ పార్టీతో అవసరాల మేరజు జట్టు కట్టింది. రానున్న రోజుల్లో ఇదీ మళ్లీ ఖచ్చితంగా జరగదని చెప్పలేము.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పరస్థితి రాష్ట్రంలో పెద్దగా ఆశజనకంగా ఏమీ కనిపించడం లేదు. ఆ పార్టీ నుండి గెల్చిన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొందరు చేజారి పోయారు. అంగ, ఆర్థిక బలం ఉన్న నేతలు పార్టీ నుండి బయటికి వచ్చి టీడీపీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న దాన్ని తనకు అనుకూలంగా మరల్చుకునే స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదనే చెప్పాలి. ఒక పక్క కేసులు మరో పక్క పార్టీ వ్యవహారాలతో అధినేత జగన్ సతమతమవుతున్నారు. టీడీపీ-బీజేపీల మధ్య వైరాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు లేవు. ఎన్నికలకు ముందు ప్రధానితో ఏపీ ప్రత్యేక ప్యాకేజీపై అనుకూల ప్రకటన చేయించి బీజేపీతో జట్టుకట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తున్నప్పటి దాని ఆశలు ఎంతవరకు నెరవేరతాయనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం కష్టం.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో ఏమాత్రం మెరుగుపడలేదు. నేతలంగా రాష్ట్ర విభజన సమయంలోనే పార్టీని వదిలి తమదారి తాము చూసుకున్నారు. ఉన్న కొద్దిపాటి మంది కూడా ఏదో పార్టీలో నెట్టుకొస్తున్నారు తప్ప వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మారుతుందనే ఆశలు వారిలో ఏ మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా ప్రజల్లో రేగిన కసి ఇంకా ఏమాత్రం తగ్గిన సూచనలు లేవు.
బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం వల్ల రానున్న రోజుల్లో రాష్ట్రంలోని సమస్యలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే కారణ మంటూ విమర్శించే అవకాశం టీడీపీకి వస్తుంది. విభజన వల్ల జరిగిన నష్టాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల మరింత కష్టాలు వచ్చాయంటూ టీడీపీ తన వైఫల్యాలను తప్పించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద వీరిద్దరి మధ్య చెడిన సఖ్యతను తమకు అనుకూలంగా మార్చుకునే స్థితిలో ఏ పార్టీ కనిపించడం లేదు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *