భారతమాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

భారత మాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భారత మాతను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో పాటుగా వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచిన యలమంచలి విజయ్ కుమార్ పై పోలీసు కేసు నమోదు కావడంతో వలపన్నిన పోలీసులు విజయ్ ను అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్ల రావుల పాలెం మండలం రావులపాడుకి చెందిన యలమంచిలి విజయ్ కుమార్ కు విజయ్ కుమార్ అలియాస్ బ్రదర్ విజయ్ అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కొత్తపేట క్రీస్ట్ చర్చీలో నివాసం ఉంటున్న విజయ్ ఓ క్రైస్తవ సంస్థకు డైరెక్టర్ గా కూడా ఉన్నాడు. భారతమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసి వాటిని యూట్యూబ్ లో ఉంచిన విజయ్ పై కునాల్ అనే వ్యాపారి పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 7న ఫిర్యాదు చేశాడు. అప్పటి నుండి తప్పించుకుని తిరుగుతున్న విజయ్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించండంతో పాటుగా ఇతర వర్గాలను కించపర్చే విధంగా వ్యహరించిన విజయ్ పై పలు సెక్షన్ ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు.
మత విధ్వేషాలకు పాల్పడే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. మతాల మధ్య చిచ్చుకు ప్రయత్నించడంతో పాటుగా ఇతర మతస్థులను కించపర్చే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భారత మాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్ కుమార్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు. యూట్యూబ్ లో విజయ్ ఉంచిన పోస్టుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటుగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.