భారీ వర్షల కారణంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఓక్కీ తుఫాను వల్ల దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల వల్ల శబరిమలకు వెళ్లే ఘాట్ రోడ్ లో అనేక చెట్లు కూలిపోయాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో శబరిమలకు వెళ్లే దారులను మూసివేశారు. దీనితో పాటుగా ఆలయాన్ని కూడా మూసివేస్తున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. గురవారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసి ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాలు తగ్గని పక్షంలో మరో ప్రకటన ద్వారా పరిస్థితిని వివరించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రహదారులు మూసివేయడంతో అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీదనే వాహనాలు నిల్చిపోవడం పైగా భారీ వర్షాలు పడుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
అటు దక్షిణ తమిళనాడును కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కన్యాకుమారి, రామేశ్వరం లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షాలకు ఇప్పటివరకు నలుగురి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావం మరో 36 గంటల పాటు ఉండవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.