అటల్ బిహారీ వాజ్ పేయి కన్నుమూత

భారత మాజీ ప్రధాని, “భారత రత్న” అటల్ బిహారీ వాజ్ పాయి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం నుండి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రదాని నరేంద్ర మోడీతో సహా ఆయన మంత్రివర్గ సహచరులు, బీజేపీ ఆధ్యక్షుడు అమిత్ షా తో పాటుగా పార్టీ అగ్రనేతలంతా ఎయిమ్స్ కు వచ్చి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అంతకు ముందు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత, వాజ్ పేయి సహచరుడు ఎల్.కే.అధ్వానీ, కేంద్ర విదేశీ వ్యవహార శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ తో పాటుగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నేతలు ఎయిమ్స్ కు వచ్చి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎయిమ్స్ కు వచ్చిన వారిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరుక్ అబ్దుల్లా కూడా ఉన్నారు.
గ్వాలియర్, ఆగ్రాలలో ఉన్న వాజ్ పేయి బంధువులు కూడా ఎయిమ్స్ కు చేరుకున్నారు. వాజ్ పేయి కొద్ది సంవత్సరాలుగా ఇంటికే పరిమితం అయ్యారు. మతిమరుతు ఇతరత్రా ఆనారోగ్య సమస్యల వల్ల ఆయన ప్రజాజీవితానికి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు. అడపాదడపా బీజేపీ అగ్రనేతలు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి కొంత మంది మినహా వాజ్ పాయిని కలిసే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. భారత రత్న అవార్డును సైతం ఆయన నివాసానికే వెళ్లి ఇవ్వాల్సి వచ్చింది.