ఆర్య వైశ్యుల మనోభావాలను దెబ్బతీస్తున్న కంచె ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలని ఆర్యవైశ్యుల హక్కుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. తన పుస్తకంలో ఆర్యవైశ్యుల గురించి పిచ్చిపిచ్చి రాతలు రాసిన ఐలయ్యపై ప్రభుత్వం కఠిన చర్యతీసుకోవాలనే డిమాండ్ తో ఐక్య వేదిక నాయకులు ఉప్పల్ లో రిలే నిరాహారదీక్షకు దిగారు. అర్థం పర్థం లేని రాతలతో కంచె ఐలయ్య సమాజంలో అశాంతిని రాజేస్తున్నాడని ఆర్యవైశ్యుల హక్కుల ఐక్య వేదిక నాయకులు ఆరోపించారు. సమాజాన్ని తీల్చే కుట్రలో భాగంగానే ఇటువంటి రాతలు రాస్తున్నారని ఐలయ్య వెనక ఉండి నడిపిస్తున్న వారు ఎవరనేదానిపై ప్రభుత్యం విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ధార్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ సమాజ హితానికి పాల్పడుతున్న ఆర్యవైశ్యులను కించపర్చే విధంగా రాతలు రాయడం దారుణమని వారన్నారు. ప్రభుత్వం పై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్న ఆర్యవైశ్యులను గురించి చెడు రాతలు రాయడం ఐలయ్య మానసిక దౌర్భాగ్యానికి నిదర్శనమని వారన్నారు.
గతంలో బ్రాహ్మణులపై పిచ్చి ప్రేలాపనలు చేసిన ఐలయ్య ఇప్పుడు వైశ్యులపై అసంబద్దరాతలు రాస్తున్నాడని వారు మండిపడ్డారు. ఆర్యవైశ్యులపై ఇష్టం వచ్చినట్టు రాతలు రాసిన ఐలయ్య వారిని మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని అతనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఐలయ్యను అరెస్టు చేసే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు బిక్కుమల్ల సుధాకర్ గుప్త, బిక్కుమల్ల రమేష్ గుప్త, బి.రవీందర్, యాయి మదుసుధన్ పాల్గొన్నారు.