బడ్జెట్ కేటాయింపులపై ఏపీ సీఎం ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ కేటాయింపుల పై ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం తమకు అందిచాల్సిన కనీస నిధులను కూడా కేటాయించలేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ కేటాయింపులపై తమ నిరసనను గట్టిగానే చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు కేంద్రంతో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ, ప్రభుత్వంలోని ముఖ్యలతో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న పార్టీ, ప్రభుత్వంలోని కీలక నేతలతో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి భారీగా నిధులను ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏపీకి తోడ్పాటు అవసరమని చెప్తూ వస్తున్న చంద్రబాబు ఈ మేరుక కేంద్రానికి తమ విజ్ఞప్తుల జాబితాను పంపారు. అయితే వాటిలో వేటినీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది.
బడ్జెట్ పై పార్టీలోని ప్రముఖులతో మాట్లాడిన చంద్రబాబు వద్ద పలువురు నేతలు, మంత్రులు కేంద్ర వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మిత్రపక్షంగా ఉండి కూడా సరైన నిధులు రాబట్టుకోలేకపోతే రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారన్నట్టు సమాచారం. వివిధ రంగాలకు జరిగిన కేటాయింపుల్లో ఏపీకి ఇచ్చినవి మినహా పెద్దగా ప్రత్యేక నిధులు ఏవీ రాష్ట్రానికి రాలేదని వారు చంద్రబాబు దృష్టికి తీసుకుని వచ్చారు. దీనితో కేంద్ర ప్రభుత్వానికి నిరసన ను గట్టిగానే చెప్పాలని ఏపీ సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *