ఇండోనేషియాను సునామీ ముంచెత్తింది. సులవెసి ప్రాంతంలోని పలు నగరం ఈ ప్రకృతి విలయానికి భారీగా నష్టపోయింది. ఈ సునామీ వల్ల 430 మంది వరకు మరణించినట్టు ఇండేనేషియా మీడియా వెల్లడించింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. తొలుత సునామీ వల్ల 48 మంది మరణించినట్టు అధికార వర్గాలు చెప్పినప్పటికీ ఆ తరువాత మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. పలు నగరంలో సముద్రపు అలలు 6 మీటర్ల వరకు ఎగిసి పడినట్టు అధికారులు తెలిపారు.
తీరప్రాంత నగరం పలు జనాభా 3.5 లక్షలు. ఈ నగరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా రాకాసీ అలలు విరుచుకుని పడ్డాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పెద్ద ఎత్తున విరుచుకుని పడిన అలల ధాటికి ప్రజలు కొట్టుకుని పోయారు. చాలా రోడ్లలో మృతదేహాలు తేలియాడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గాయపడిన వారితో ఆస్పత్రులు అన్నీ నిండిపోయాయి.