జోరుగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

నిజాంపేట లోని బండారి లే అవుట్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు సాగుతున్నాయి. చెరువు, నాలాల భూములను కబ్జాలు చేస్తూ అక్రమంగా వెలిసిన బండారి లేఅవుట్ లోని విల్లాలులు, అపార్ట్ మెంట్లు కూలుతున్నాయి. అవినీతి పూనాదుల మీద నిర్మించిన ఈ కట్టడాలను హెచ్ డీఎ కూల్చివేస్తోంది. ఇప్పటికే 15 విల్లాలతో పాటుగా ఎనిమిదికి పైగా అపార్ట్ మెంట్లను కూల్చివేశారు. గ్రామ పంచాయతీలో జీ+2కు అనుమతులు తీసుకుని అయిదు నుండి ఎనిమిది అంతస్తులు నిర్మిస్తున్న కట్టడాలని కూల్చివేశారు.
చాలా వరకు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను కూల్చివేసిన అధికారులు అనుమతులు లేని అన్ని నిర్మాణాలను త్వరలోనే కూల్చివేస్తమని చెప్పారు. మరోవైపు కూల్చివేతలను అడ్డుకునేందుకు బిల్డర్లతో పాటుగా అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసిన వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతల పనులు సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 500 వరకు అనుమతులు లేని భవనాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతం మొత్తం మునిగిపోవడంతో బండారీ లేఅవుట్ వ్యవహారం ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఇక్కడి పరిస్థితిని గమనించిన అధికారులు వేటికీ అనుమతులు లేవని తేల్చేశారు. తురక చెరువుతో పాటుగా నాలాలను ఆక్రమించుకుని లేఅవుట్లు వెలిశాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ లేఅవుట్ పూర్తిగా మునిగిపోయింది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్ ఎండీఎ అధికారులు చెప్తున్నారు. అక్రమ నిర్మాణాల పట్ల ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ మండిపడిన తరువాత అదికారుల్లో చలనం వచ్చింది. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
అయితే అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలను చూసిచూడ నట్టు వదిలేసిన అధికారులు ఇప్పుడు కూల్చివేస్తామంటూ ముందుకు రావడం పై స్థానికులు మండిపడుతున్నారు. లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా ప్రోత్సహించిన వారు ఇప్పుడు కూల్చివేతలకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు పూర్తయేంతవరకు తాపీగా కూర్చుని ఇప్పుడు కూలగొట్టడం ఏంటని అంటున్నారు. అయితే అక్రమ నిర్మాణను ఉపేక్షించేది లేదని అక్రమాలకు పాల్పడిన తమ ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *