ఉప రాష్ట్రపతిగా సీ.హెచ్.విద్యాసాగర్ రావు..?

దేశ ఉప రాష్ట్రపతిగా చెన్నమనేని విద్యాసాగర్ రావు పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న ఆయన తమిళనాడు గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యావంతుల కుటుంబం నుండి వచ్చిన సీ.హెచ్.విద్యాసాగర్ రావు తెలంగాణకు చెందిన బీజేపీ నేత. కరీంనగర్ నుండి రెండు సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సీ.హెచ్.విద్యాసాగర్ రావు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. వాజ్ పేయి కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న విద్యాసాగర్ రావుకు వివాద రహితుడిగా పేరుంది. బీజేపీలోని అందరినీ కలుపుకుపోయే మనిషిగా పేరున్న ఆయన మోడీకి కూడా సన్నిహితుడే. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన విద్యాసాగర్ రావు తీరు పార్టీ వర్గాలను ఆకర్షించింది.
న్యాయశాస్త్ర పట్టభద్రుడైన విద్యాసాగర్ రావు న్యాయవాదిగా పనిచేస్తూనే జన సంఘ్ లో చేరారు. అక్కడి నుండి బీజేపీలోకి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలోని కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. మెట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున గెల్చిన ఆయన శాసనసభలో చురుకైన నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆ అంశంపై నైనా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న నేతల్లో ఆయన ఒకరు గోదావరి జాలాలపై ప్రాజెక్టులకోసం ఉధ్యమించిన విద్యాసాగర్ రావు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించారు.
ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ఆగస్టు 11వ తేదీతో ముగియనుంది. అన్సారీ స్థానంలో బీజేపీ ఉపరాష్ట్రపతి పదవికి విద్యాసాగర్ రావును ఎంపికచేస్తుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతిగా ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చిన బీజేపీ ఉప రాష్ట్రపతిగా దక్షిణ భారత దేశానికి అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకి విధేయంగా ఉంటూ వచ్చిన విద్యాసాగర్ రావు పేరు తెరపైకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *