టెలివిజన్ నటిపై అత్యాచారం కేసులో నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే టెలివిజన్ నటికి అనంతపురంలో మెడికల్ షాపు నిర్వహించే గిరీశ్ లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. కాగితాల మీద సంతకాలు పెట్టాలంటూ ఆమెను అనంతపురంకు పిలిపించి ఒక పథకం ప్రకారం ఆమెతో మత్తు మందు కలిపిన కూల్ డ్రింగ్ తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటుగా మరికొంత పై కూడా అతను ఇట్లానే చేసినట్టు ఆ నటి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు కమిషనర్ చెప్పారు. డబ్బుల కోసం బెదిరింపులకు దిగుతూ అనంతపురంలోని ఓ గదిలో బందించి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేసినట్టు కమిషనర్ చెప్పారు.
నటి పట్ల నిందుతుడు అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ చిత్రహింసలకు గురిచేసినట్టు కమిషర్ చెప్పారు. అతని దారుణాలను భరించలేని నటి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసిందని దీనితో రంగంలోకి దిగిన పోలీసులు నటిపై అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గిరీశ్ నటితో పాటుగా మరికొంత మందిని కూడా వేధిస్తున్నట్టు తెలిసిందని వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారు భయపడాల్సిన అవసరం లేదని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కమిషనర్ హామీ ఇచ్చారు.