రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం కుదరనట్టే కనిపిస్తోంది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు సమాయత్తం అవుతున్నాయి. విపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి పదవికి పోటీపడే అభ్యర్థి పేరును ఈనెల 22న ప్రకటించే అవకాశం ఉంది. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి పదవికి రామ్ నాథ్ కోవింద్ పేరును బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అయితే రామ్ నాథ్ ను పూర్తిగా వ్యతిరేకించన కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని ఈ నెల 22న జరిగే విపక్షాల సమావేశం తరువాత వెల్లడిస్తామని చెప్పింది. బీజేపీ విపక్షాలకు సమాచారం ఇవ్వకుండూ ఏక పక్షంగా అభ్యర్థిని ప్రకటించారని కాంగ్రెస్ అంటోంది. తమ వైఖరిని త్వరలోనే వెల్లడిస్తామని ఆ పార్టీ చెప్తోంది.
పోటీతప్పదు:సీపీఎం
రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదని వామపక్షాలు అంటున్నాయి. తాము ముందు నుండే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ ప్రతినిధి బృందానికి కొన్ని షరతులు విధించామని అయితే బీజేపీ వాటిని పట్టించుకున్నట్టు కనిపించడంలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విపక్షాల తరపున పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనే విషయాన్ని 22న ప్రకటిస్తామని ఆయన చెప్పారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థికి ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయని అటువంటి అభ్యర్థిని దేశ అత్యున్నత పదవికోసం ఒప్పుకునే ప్రశక్తిలేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. విపక్షాలు అన్నీ కలిసి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
అధ్వానీ, సుష్మ ఎమ్మయ్యారు?
రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అధ్వానీ లేదా సుష్మా స్వారాజ్ పేర్లను ప్రతిపాదిస్తే బాగుడేందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అధ్వానీ పేరును ఎందుకు పరిశీలించలేదని ఆమె ప్రశ్నించారు. దళిత నేతను ప్రకటించామని చంకలు గుద్దుకుంటున్న బీజేపీ తమ పార్టీ కి చెందిన దళిత మోర్చా నాయకుడిని ప్రకటించిందని రామ్ నాథ్ ను మించిన దళిత నేతలు దేశంలో చాలా మంది ఉన్నారని మమత అన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముకర్జీని రెండోసారి కొనసాగించినా తాము మద్దతు ఇస్తామని మమత అంటున్నారు. తమ ప్రతిపాదనలను పట్టించుకోని బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదన్నారు.