రామ్ నాథ్ కోవిందానే ఎందుకు…?

రాజకీయ, సామాజిక సమీకరణాల మేరకే బీజేపీ రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. అగ్రవర్ణాల పార్టీగా పేరుపొందిన బీజేపీ ఆ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే రాష్ట్రపతి పదవికోసం దళిత నేతను ఎంపికచేసింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మొదటి నుండి ముందున్న  జార్ఖండ్ గవర్నర్ ద్రైపతీ ముర్మీని పక్కన పెట్టిన బీజేపీ రామ్ నాథ్ ను వ్యూహాత్మకంగానే ఎంపికచేసింది. ఆదివాసీ తెగకు చెందిన మహిళకు అవకాశం ఇస్తారంటూ జరిగిన ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. ఆదివాసీల కన్నా సంఖ్యా పరంగా ఎక్కువగా ఉన్న దళిత అభ్యర్థికే బీజేపీ ఓటువేసింది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న యూపీలో ధళితుల సంఖ్య 20శాతానికి పైగానే ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు పెట్టింది పేరైన యూపీ లో తన పట్టును ఏ మాత్రం సడలకుండా జాగ్రత్త పడతున్న బీజేపీ అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి పదవికోసం ఎంపిక చేయడం ద్వారా దళితులను తమ వైపు తిప్పుకునే పనిలో పడింది.
తమ రాష్ట్రపతి అభ్యర్థిని వ్యతిరేకించే అవకాశాలు పెద్దగా విపక్షాలకు ఇవ్వకుండా జాగ్రత్త పడిని బీజేపీ మిత్ర పక్షాల నుండి కూడా విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని వ్యతిరేకించేందుకు స్వపక్షానికి చెందిన శివసేన సిద్దంగా ఉన్న నేపధ్యంలో బీజేపీకి చెందిన దళిన నేతను రాష్ట్రపతి పదవికి ఎంపికచేయడం ద్వారా వారికి వ్యతిరేకించే అవకాశం లేకుండా చేసింది. అదే సమయంలో లౌకిల అభ్యర్థికే మద్దతు అంటున్న కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలకు కూడా రామ్ నాథ్ ను వ్యతిరేకించడానికి పెద్దగా అవకాశం లేకుండా పోయింది. మృదు స్వభావిగా పెరుండడంతో పాటుగా దళిన నేత కావడంతో ఆయన్ను వ్యతిరేకించే అవకాశం విపక్షాలకు లేకుండా చేసింది. ఒక దళిత నేతను రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నారనే అప్రదిష్టను మూటకట్టుకునేందుకు విపక్షాలు సిద్ధంగా లేవని గ్రహించిన బీజేపీ ఈ ఎత్తువేసినట్టు కనిస్తోంది. దళిత వ్యక్తిని వ్యతిరేకిస్తే విపక్షాలు కూడా దళిత అభ్యర్థినే రంగంలో దింపాల్సి వస్తుంది. అప్పుడు కూడా దళితుల మధ్య చిచ్చుపెట్టారనే చెడ్డపేరు ఏలాగూ తప్పదు. ఇన్ని రకాలుగా ఆలోచించి రామ్ నాథ్ పేరును బీజేపీ ప్రతిపాదించినట్టు కనిపిస్తోంది.
న్యాయవాదిగా పనిచేసిన అనుభవంతో పాటుగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి కావడం కూడా రామ్ నాథ్ కు కలసివచ్చింది. వీటితో పాటుగా ఆయనపై ఎటువంటి వివాదాలు లేవు. ఆయన పేరు దేశ ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేకపోవడం కూడా బీజేపీకి కలిసివచ్చే అంశమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే రామ్ నాథ్ ను బీజేపీ దేశ అత్యున్నత పదవికి తమ అభ్యర్థిగా ప్రకటించినట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *