రాష్ట్రపతి అభ్యర్థిపై కుదరని ఏకాభిప్రాయం

భారత తదుపరి రాష్ట్రపతి ఎవరనే విషయంపై పార్టీల ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. రాష్ట్రపతి ఎన్నికల తేదీ సమీపిస్తున్నా అధికార ప్రతిపక్షపార్టీల మధ్య అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కనిపించడంలేదు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేసుకోడమే తమ ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయ సాధనకు సహకరించాల్సిందిగా సోనియాను వారు కోరారు. అయితే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు. దీనితో అభ్యర్థి ఎవరేనేది తెలియకుండా మద్దతు ఎట్లా కోరతారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు తమ పార్టీ అధినేత్రిని కలిసినా రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలబెట్టాలనేదే తమ అభిప్రాయమని అయితే అభ్యర్థి ఎవరనేది తెలియకుండా మద్దతు ఇవ్వలేమని గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు.
బీజేపీ బృందం కాంగ్రెస్ తో పాటుగా ఇత పార్టీల నేతలతోనూ సమావేశం అవుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అందరిని మద్దతును కూడగట్టడం ద్వారా ఏకగ్రీవ ఎన్నిక ఎన్నికకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్డీఏ అభ్యర్థి ఎవరనేది తేలిన తరువాతే తాము ఓ నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు వేచిచూస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *