విశాఖపట్నం విమానాశ్రయంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జే.సీ.దివాకర్ రెడ్డి చిందులు తొక్కారు. విమానాశ్రయ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ప్రింటర్ ను విసిరేశారు. సహచర ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు విశాఖకు వచ్చిన జే.సీ. అక్కడి నుండి హైదరాబాద్ కు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చారు. ఆలస్యంగా వచ్చిన జే.సి.తో బోర్డింగ్ పాస్ లు ఇచ్చే కౌంటర్ ను మూసేసినట్టు సిబ్బంది చెప్పడంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. కౌంటర్ లోపలికి వెళ్లి ప్రింటర్ ను విసిరికొట్టే ప్రయత్నం చేశారు. విమాన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. దీనిపై ఢిల్లీలో తేల్చుకుంటానంటూ మండిపడ్డారు. ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ అగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక ఇండిగో సిబ్బంది బోర్డింగ్ పాస్ ను ఇవ్వడంతో ఆయన విమానం ఎక్కి వెళ్లిపోయారు. జేసీ విమానాశ్రయంలో చేసిన రాద్దాంతం అంతా సీసీ టీవీల్లో రికార్డు అయింది.
తాను విమానాశ్రయంలో ఎవరిపట్లా దురుసుగా ప్రవర్తించలేదని జేసీ అంటున్నారు. తాను సకాలంలోనే విమానశ్రయానికి చేరుకున్నానని అంటున్న ఆయన బోర్డింగ్ పాస్ ఇవ్వాలని మాత్రమే సిబ్బందిని అడిగాను తప్ప వారిని ఏమీ అనలేదంటున్నారు. ఈ విషయాన్ని మీడియా అనవసరంగా రాద్దాంతం చేస్తోందని జేసీ అంటున్నారు. జేసీ దురుసు ప్రవర్తనకు సంబంధించి ఇంత వరకు ఇండిగో సంస్థ నుండి ఎటువంటి ఫిర్యాదు అందలేదని విమాశ్రాయ అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ నిర్వహించిన తరువాత దీనిపై స్పందిస్తామని ఇండిగో పేర్కొంది. జేసీ దురుసు ప్రవర్తనకు సంబంధించి ఇంకా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఆ సంస్థ పేర్కొంది. విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకే చెందిన అశోక్ గజపతి రాజు వ్యవహరిస్తున్నారు. ఎంతటి వీఐపీలు ఐనా సాధారణ ప్రయాణికుల మాదిరే వ్యవహరించాలని సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన గతంలో వ్యాఖ్యానించారు.