వర్షపు నీళ్లపై సీఐడీ విచారణ

ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ లోకి వర్షపు నీరు వచ్చిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఏపీ రాజధాని అమరావతిలో నూతంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలోకి జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ లోకి మంగళవారం కురిసిన వర్షానికి నీరు చేరింది. దీనితో అసెంబ్లీ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని నాసిరకరం నిర్మాణాలు చేపట్టారంటూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు జగన్ ఛాంబర్ ను పరిశీలించి ప్రభుత్వం పై మండిపడ్డారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. సచివాలయంతో పాటుగా అసెంభ్లీ భవనాలను ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఏసీ పైపు ద్వారా నీరు లోపలికి వచ్చినట్టు గుర్తించారు.
అటు అసెంబ్లీలో జగన్ ఛాంబర్ లోకి వర్షపు నీరు ఎట్లా వచ్చిందో తెల్చడానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ ఛాంబర్ పైన ఏసీ కోసం వేసిన పైపును ఎవరో ఉద్దేశపూర్వకంగానే కోసినట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, సిబ్బంది తప్ప ఇతరులు వచ్చేందుకు అవకాశంలేని ప్రాంతంలో పైపులు కోసి ఉండడం అనుమానాలకు తావు ఇచ్చేదిగా ఉందని ఆయన చెప్పారు. సీఐడీ విచారమలో నిజానిజాలు బయటికి వస్తాయని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికే పైపులను కోసేశారని అన్న స్పీకర్ దానికి సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీలోకి వర్షపు నీరు అంశంపై సామాజిక మాధ్యమాల్లో అధికార, ప్రతిపక్ష అభిమానుల మధ్య యుద్ధం జరుగుతోంది. నాసీ రకం నిర్మాణాలని, తెలుగుదేశం ప్రభుత్వం అసమర్థత అంటూ ఒక వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే దానికి ధీటుగా ప్రతీదాన్ని రాజకీయం చేస్తున్నారని కేవలం విపక్ష నేత ఛాంబర్లోకే నీళ్లు ఎట్లా వచ్చాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కావాలని పైపులు కోసేశారని వైసీపీవి నీచ రాజకీయాలంటూ విరుచుకు పడుతున్నారు. మొత్తం మీద తొలకరి వర్షాలు ఏపీ రాజకీయ రొచ్చును మిగిల్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *