44 బోగస్ ఖాతాల్లో 100కోట్లు

ఢిల్లీలోని యాక్సెస్ బ్యాంకులో 44 నకిలీ నోట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల్లో పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం ప్రకటన చేసిన తరువాతి నుండి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు జమ అయినట్టు ఐటి అధికారులు గుర్తించారు. ఈ ఖాతాలను నకిలీ గుర్తింపు పత్రాల ద్వారా తెరిచినట్టు ఐటి అధికారులు చెప్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ చేసినా దానికి తగ్గట్టుగా పత్రాలను సమర్పించకుండా నకిలీ పత్రాల ద్వారా ఖాతాలను తెరిచినట్టు గుర్తించిన అధికారులు సదరు ఖాతాలను స్థంబింపచేసే పనిలో పడ్డారు. ఈ బోగస్ ఖాతాలలో పెద్ద మొత్తంలో జమ అయిన నగదులు బంగారం కొనుగోలు చేసేందుకు ఉంచిఉంటారని భావిస్తున్నారు.

ఈ బోగస్ ఖాతాలను తెరవడంలో బ్యాంకు అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉందనే విషయంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన చాందినీ చౌక్ ప్రాతంలో ఉన్న యాక్సెస్ బ్యాంకులో ఈ ఖాతాలను తెరిచారు. గతంలో ఇదే బ్యాంకు శాఖలో 3.5కోట్ల రూపాయలను దొడ్డి దారిన తీసుకుని వెళ్తున్న ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత ఈ బ్యాంకులో దాదాపు 450 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అందులో వంద కోట్ల రూపాయల మేర బోగస్ ఖాతాల్లో జమ అయినట్టు ఐటి అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.