సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు రాజమౌళి

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సీసీఎస్,సైబర్ క్రైమ్ కార్యాలయానికి వచ్చారు. బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఆయన ఏసీపీ రఘువీర్, డీసీపీ అవినాశ్ మహంతినిలను కలిశారు. ఇటీవల బాహుబలి చిత్రాన్ని పైరసీ చేసిన కొంత మంది అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే సినిమాను నెట్ లో పెడతామంటూ బెదిరిపింపులకు పాల్పడిన నేపధ్యంలో వీరు సైబర్ పోలీస్ కార్యాలయానికి వచ్చారు. ఈ  కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులతో సమావేశం అయిన  తరువాత రాజమౌళి మీడియాతో మాట్లాడారు. అడినన్ని డబ్బులు ఇవ్వకపోతే చిత్రాన్ని ఇంటర్నెట్ లో పెడతామంటూ బెదిరింపులకు దిగారని చెప్పారు. పోలీసుల సహకారంతో బీహార్లోని బుగుసరాయ్ లో వారిని పట్టుకున్నామని చెప్పారు. నిందితులను పట్టుకోవడంతో బీహార్ పోలీసులు అసలు సహకరించలేదని రాజమౌళి వివరించారు. తెలంగాణ పోలీసుల  చొరవ వల్లే నిందితులు చిక్కారని చెప్తూ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చానని అన్నారు. అర్కా మీడియా తరపున, సినీ పరిశ్రమ తరపున పోలీసులకు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. పోలీసులు సకాలంలో స్పందిచకపోయి ఉంటే భారీ నష్టం జరిగేదని అన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమాలు పైరసీలకు గురవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలను పైరసీ చేసి నిర్మాతలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న వారిపై కఠిన  చర్యలు తీసుకోవాలని కోరారు.
బాహుబలి చిత్రాన్ని పైరసీ చేయడంతో పాటుగా నిర్మాతలను డబ్బుకోసం  బెదిరింపులకు  పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఏసీపీ రఘువీర్ చెప్పారు. బీహార్ రాజధాని పట్నా శివార్లలోని ఒక ధియేటర్ నుండి సినిమాను వీరు డౌన్ లోడ్ చేశారని ఆయన తెలిపారు. మొదట కరణ్ జోహర్ ను డబ్బుకోసం డిమాండ్ చేశారని ఆయన సినిమాకి డిస్టిబ్యూటర్ మాత్రమేనని తెలుసుకుని హైదరాబాద్ లోని బాహుబలి నిర్మాతలకు ఫోన్ చేసి  డబ్బును డిమాండ్ చేశారని ఈ క్రమంలో వలపన్ని నిందుతులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితులు ఇప్పటివరకు ఏయే సినిమాలను పైరసీ చేసింది తెలుసుకుంటున్నామని అన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోదంని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *