ప్రయాణికులున్నా ఖాళీగా వెళ్తున్న వజ్రా బస్ లు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)  కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర బస్సుల ఆలోచన మంచిదే అయినా ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలం అవుతోంది. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన ఈ బస్సులు ఖాళీగా తిరుగుతూ ఆర్టీసీకి భారంగా మారుతున్నాయి. బస్సుల్లో సీట్లున్నా… ఎక్కేందుకు ప్రయాణికులు ఉన్నా ఆర్టీసీ యాజమాన్యం పెట్టిన కొన్ని నిబంధనల కారణంగా బస్సులు ఖాళీగా తిరాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఆర్టీసీ బస్టాండ్ల నుండే కాకుండా హైదరాబాద్ లోని కాలనీల నుండి జిల్లా కేంద్రాలకు బస్సులు నడపాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులకు బస్టాండ్ లకు వెళ్లే భారం లేకుండా కాలనీల్లో తిరిగేందుకు వీలుగా వజ్రా పేరుతో మినీ బస్సులను ఆర్టీసీ ప్రారభించింది. హైదరాబాద్ లోని వివిధ కాలనీల నుండి వరంగల్, నిజామాబాద్ లకు బస్సులను ఏర్పాటు చేసింది. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ బస్సులు సౌకర్య వంతంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యల వల్ల ఖాళీగా బస్సులు తీరగాల్సి వస్తోంది.
ఈ వజ్రా బస్సుల్లో టికెట్లు జారీ చేసే యంత్రాలు లేవు. ఆర్టీసీ కౌంటర్లలోనూ ఈ  బస్సు టికెట్లను అమ్మడం లేదు. కేవలం ఒక ప్రత్యేక యాప్ ద్వారానే ఈ బస్సుల్లో టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా కొన్ని ప్రైవేటు రిజర్వేషన్ కౌంటర్లలో ఈ వజ్రా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దీనిపై ప్రయాణికులకు సరైన అవగాన లేకపోవడంతో బస్సుల్లో సీట్లున్నా ఈ బస్సుల్లోకి ప్రయాణికులను అనుమతించడం లేదు. టికెట్లు ఇచ్చే అవకాశం తమకు లేదని డ్రైవర్లు చెప్తున్నారు. ఒక పక్క బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు పడుతున్నా వజ్రా బస్సులు మాత్రం  ఖాళీగా గమ్యస్థానాలు  చేరుతున్నాయి. దీని వల్ల అటు ఆర్టీసీ నష్టపోతుండడంతో పాటుగా ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ బస్సు వెళ్తున్నా అందులో ఎక్కే  మార్గం లేదని వాపోతున్నారు. చాలా మంది డ్రైవర్లతో గొడవలకు దిగుతున్నారు.
ప్రస్తుతం కేవలం 15 నుండి 18 అక్యూపెన్సీ రేటుతోనే వజ్రా బస్సులు తిరుగుతున్నాయి. వేసవి కాలం సీజన్ లో కూడా బస్సులు ఖాళీగా తిరుగుతుండడం పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు తీసుకుని వజ్రా బస్సుల్లో  టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *