ధర్నా చౌక్ పై ఎందుకింత గొడవ

ధర్నా చౌక్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సామాజిక మాధ్యమాల్లో అయితే ధర్న చౌక్ వ్యవహారంతో రెండు వర్గాలుగా చీలిపోయిన నెటిజన్లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అసలు దీనిపై ఇంత రాద్దాతం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ వ్యవహారాన్ని ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సమస్య తీవ్రమవుతోంది తప్ప పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. అటు ప్రభుత్వం కానీ ఇటు విపక్షాలు కానీ ఈ వ్యవహారంలో  పట్టు విడవకపోవడంతో ధర్నా చౌక్ వ్యవహారం  పెద్ద సమస్యగా  మారింది. తెలంగాణ జేఏసీ ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన దీక్షతో ఈ వివాదం రాజుకుంది. జేఏసీ దీక్షకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం ధర్నా చౌక్ తరలింపు ప్రతిపాదనను ముందుకు తీసుకుని రావడంతో వివాదం మరింత ముదిరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ప్రశ్నించే వారి నోళ్లు నొక్కుతోందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రజా సంఘాలకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుపుకుంది. ధర్నా చౌక్ వ్యవహారంలో విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నా అధికార పక్షం కూడా వాటికి ధీటుగానే సమాధానం ఇస్తోంది. ఈ వ్యవహారంలో వెనక్కితగ్గే ప్రశక్తి లేదంటూ ప్రభుత్వం మంకుపట్టు పట్టడంతో వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది.
ధర్నా చౌక్ కు స్థానిక అంశం తోడవడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ధర్నా చౌక్ వద్ద తాము ఇబ్బందులు పడుతున్నామని దాన్ని ఇక్కడి నుండి తొలగించాలంటూ చేస్తున్న ఆందోళన ప్రభుత్వ మద్దతుతోనే జరుగుతోందనేది అందరికీ తెలిసిన సత్యమే. ఏకంగా ఒక సిఐ స్థానిక మహిళలతో పాటుగా కానిస్టేబుళ్లతో కలిసి సివిల్ దుస్తుల్లో ధర్నాకు దిగడం దాన్ని మీడియా పసిగట్టడం మరింత వివాదాస్పదమైంది. ధర్నా చౌక్ ఆక్రమణ పేరుతో విపక్షాలు చేసిన ప్రయత్నం రక్తశిక్తం కావడంతో రెండు పక్షాలు పట్టుదలలకు పోతుండడంతో వివాదం తీవ్రరూపం దాలుస్తోంది.
నగరం నడిబొడ్డున ధర్నా చౌక్ ఉండడం వల్ల  అనేక ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం అంటోంది. ధర్నా చౌక్ ను ఇందిరాపార్క్  నుండి దూరంగా తరలించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని, తాము ప్రజల హక్కులకు హరించడం లేదని ఇబ్బందుల దృష్ట్యా  ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది. ఆందోళన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ప్రసారం చేసే సౌకర్యాలు వార్తా ఛానళ్లుకు అందుబాటులోకి వచ్చిన క్రమంలో నగరం నడిబొడ్డునే ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం లేదనేది ప్రభుత్వం  వాదన. అయితే ఈ వాదనను విపక్షాలు తప్పుబడుతున్నాయి. ధర్నా చౌక్ ను శివార్లకు తరలించడం ద్వారా ప్రజలు నోరు నొక్కే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయనే సాకుతో ఆందోళన కార్యక్రమాలపై ఉక్కు పాదం మేపే ప్రయత్నాలు చేస్తున్నాయని విమకాక్షలు విమర్శిస్తున్నాయి. ఎక్కడో ఊరవతల ధర్నాలు చేసుకోండని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.రెండు వర్గాలు ఎవరికివారు ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకం తీసుకోవడం తో సమస్య మరింత జటిలంగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *