సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వాకాటి నారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవడం ద్వారా విపక్షల విమర్శల నుండి టీడీపీ తప్పుకునే ప్రయత్నం చేసింది. సీబీఐ కేసుల గురించి నిత్యం జగన్ ను విమర్శించే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీపైనే సీబీఐ దాడులు జరగడంతో ఖంగుతిన్న పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆరోపణలు వచ్చిన వెంటనే వాకాటిని సస్పెండ్ చేయడం ద్వారా పార్టీకి మలికి అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే పార్టీ నుండి తమ నేతను సస్పెండ్ చేయడంపై వాకాటి అనుచరులు ఆగ్రహంతో ఉన్నట్టు సమచారం. సీబీఐ దాడులతో తమ నేత ఇబ్బందులు పడుతున్న సమయంలోనే ఆయన్ను పార్టీ నుండి సాగనంపడం సమంజసం కాదనేది వారి వాదన.
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తప్పుడు పత్రాలతో బ్యాంకులను మోసగించి పెద్ద మొత్తంలో రుణాలు పొందినట్టు ఆరోపణలు రావడంతో వాకాటి నివాసంలో శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆయనపై సీబీఐ కేసును నమోదు చేయడంతో అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్ర, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన వెంటనే వాకాటి వ్యవహారంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సీబీఐ కేసులు నమోదు చేసినందువల్లే వాకటిని పార్టీ నుండి సస్పెండ్ చేశామని చెప్పారు. ఆయనపై ఆరోపణలు వచ్చినందున పార్టీ నుండి బయటకు పంపామని కేసుల నుండి విముక్తి లభించిన తరువాత పార్టీలోకి తిరిగి తీసుకుంటామని అన్నారు.