ఒక ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు పేరు

     తెలంగాణలో ఒక సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు పేరు పెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రనికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు ఆయన పేరుపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్ణయించారు. ఈ ఉదయం కన్నుమూసిన నీటి పారుదల రంగ నిపుణులు విద్యాసాగర్  రావు బౌతిక కాయానికి నివాళులు అర్పించిన తరువాత కేసీఆర్ ప్రగతి భవన్ లో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. విద్యాసాగర్ రావు రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివన్న సీఎం ఆయన సేవలను కలకలాం గుర్తుంచుకునేటట్లుగా ఒక ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టనున్నట్టా చెప్పారు. ఏ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలో నిర్ణయించి ప్రతిపాదనలు పంపాలని నీటిపారుదల శాఖను సీఎం  ఆదేశించారు.

విద్యాసాగర్ రావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం నీటిపారుదల రంగంపై ఆయనకు అపార పరిజ్ఞానం ఉండేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తరపున పలు సందర్భాల్లో ఆయన బలంగా వాదించారని ఆయనకున్న పరిజ్ఞానంతో ఇతరులు ఆయనతో విభేదించే అవకాశం లేకుండా కూలంకషంగా చెప్పేవారని అన్నారు. అపార విషయ పరిజ్ఞానం ఉన్న విద్యాసాగర్ రావు మరణం రాష్ట్రానికి తీరనిలోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నీటిపారుదల రంగంలో అంతటి విషయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరూ లేరని అన్నారు. నీళ్లు-నిజాలా పేరిట ఆయన వ్యాసాల వల్ల సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకునేలే చేసిందన్నారు.