నీటి లెక్కల సార్ ఇకలేరు

తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు, నీటి పారుదల రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు కన్నుమూశారు.  తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన గత కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఆయన మరణంతో సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం గొప్ప నిపుణుడిని కోల్పోయింది. కేసీఆర్ కు విద్యాసాగర్ రావు అత్యంత సన్నిహితుడు.  సాగునీటి రంగంలో ఆయనకు అపార అనుభవం ఉంది. తెలంగాణలో సాగునీటి లభ్యత అవకాశాలపై ఆయన అనేక నివేదికలను రూపొందించారు. కేసీఆర్ కు సాగునీటి రంగంగంలో పూర్తి అవగాహన రావడానికి విద్యాసాగర్ లాంటి మేధావుల సాన్నిత్యం ఉపయోగపడిందని అంటారు. నీటిపారుదల రంగంలో ఆయనకు ఉన్న విశేష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమించింది.

విద్యాసాగర్ రావు తెలంగాణ ఉధ్యమంలో కీలకంగా వ్యవహరించాడు. తెలంగాణ ప్రాంతానికి సాగునీటి వాటాల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఆయన లెక్కలతోసహా అనేక సందర్భాల్లో వివరించారు. కేంద్ర జల సంఘంలో పనిచేసిన ఆయన నీళ్లు-నిజాలు పేరిట వ్యాసాలు రాశారు.  సాగునీటి రంగంపై పలు  పుస్తకాలను ఆయన రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు శ్రీ కృష్ణ కమిటీకి టీఆర్ఎస్ అందచేసిన నివేదికలో ఆయన కీలక పాత్రను పోషించారు.

నీటి పారుదల రంగంలో విద్యాసాగర్ రావుకు ఉన్న అపార అనుభవాన్ని ఉపయోగించుకునే సమయంలోనే ఆయన కన్నుమూశారు. దీనితో నీటిపారుదల రంగానికి సంబంధించి రాష్ట్రం  పెద్ద దిక్కును కోల్పోయిందనే చెప్పాలి.