కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం ఉధ్రిక్తలకు దారితీసింది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కోదండరామ్ ఇతర జేఏసీ నాయకులు మోత్కూరు, తిరుమలగిరి,సూర్యాపేట మార్కెట్ యార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడేందుకు కోదండరామ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నిస్తుండగా మార్కెట్ లోపలికి వారిని రాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇటు కోదండరామ్ కు మద్దతుగా కొంతమంది అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు పరస్పరం పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నాలు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కోదండరామ్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో ఇరువర్గాలు తోపులాటలకు, బాహాబాహీలకు సిద్దపడడంతో పోలీసులు కల్పించుకుని పరిస్థితి చేయిదాటకుండా చక్కదిద్దారు.

కోదండరాం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తల వ్యవహారశైలిపై మండిపడ్డారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన తమ పట్ట దురుసుగా వ్యవహారించడాన్ని తప్పుపట్టారు. రైతుల సమస్యలను తెలుసుకోవడం తప్పా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తిగా అప్రజస్వామికంగా వ్యవహరిస్తున్నారని కొంత మంది నేతలు వారిని రెచ్చగొట్టి పంపారని దుయ్యబట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోదండరామ్ ఆరోపించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రైతుల సమస్యలపై అధ్యాయనం చేస్తున్నామని ఆయన చెప్పారు. అన్నదాతల సమస్యల గురించి ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. ప్రభుత్వం కల్పించుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన వారిని మార్కెట్ లలోకి రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.