వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి కోర్టులో ఊరట లభించింది. జగన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దచేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ కోర్టు తోసిపుచ్చింది. జగన్ ఈ కేసులో సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని దీని ద్వారా బెయిల్ నిబంధనలను జగన్ ఉల్లంఘించాడని పేర్కొంటూ జగన్ బెయిల్ ను రద్దుచేయాలని సీబీఐ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సీబీఐ వాదనలను కొట్టేసింది. సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నాడంటూ సీబీఐ సమర్పించిన ఆధారాలు సరిపోవని కోర్టు తెల్చిచెప్పింది.సీబీఐ చూపిన ఆధారాలతో బెయిల్ రద్దు చేయలేమని కోర్టు పేర్కొంది. జగన్ విదేశీ పర్యటనలు జరుపుకోవడానికి కూడా కోర్టు అనుమతి మంజూరు చేసింది.
సాక్షి టీవీలో ప్రసారమైన ఒక ఇంటర్వ్యూ ఆధారంగా జగన్ బెయిల్ ను రద్దుచేయాలని సీబీఐ కోర్టును ఆశ్రయించింది. అయితే జగన్ సాక్షి టీవీ వ్యవహారాల్లో ఎటువంటి జోఖ్యం చేసుకోరని ఎడిటోరియల్ టీం సాక్షిని నడుపుతుందని జగన్ తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సాక్షి రోజువారీ వ్యవహారలతో జగన్ కు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇంటర్వ్యుల నిర్వహణ తదితర బాధ్యతలన్నీ ఎడిటోరియల్ టీం చూసుకుంటుందని జగన్ తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు.