మరో కాశ్మీర్ విద్యార్థికి బెదిరింపులు

రాజస్థాన్ లోని ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ లో కాశ్మీరీ యువకుడి పట్ల కొంత మంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ లతో పాటుగా దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కాశ్మీరీ యువకులపై దాడులు, విద్వేష చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి ఘటనలు జరక్కుండా చూడాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరిన తరువాత కూడా జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. కాశ్మీర్ లోని బందిపోర్ కి చెందిన వాషీమ్ సోపి అనే విద్యార్థి బిట్స్  పిలానీ లో ఫార్మసీ విభాగంలో జూనియర్ రిసేర్ట్ ఫెలోగా  చేరాడు. 20 రోజుల క్రింతం ఇక్కడ చేరిన ఆయన స్థానిక మాలియ భవన్ వసతి గృహంలో ఉంటున్నాడు. అయితే అతనికి బెదిరింపులు రావడంతో చదువును మానేసి  వెళ్లిపోయాడు. అతని టీ షర్టుపై కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని తీవ్రంగా ధూషిస్తూ అసభ్యకరంగా రాతలు రాయడంతో సోపి ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్  తో పాటుగా  తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వార్డెన్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని రాగా అతని తల్లిదండ్రులు వెంటనే వచ్చేయాలంటూ ఒత్తిడి తేవడంతో సోపి చదువు మానేసి వెళ్లిపోయాడు. బిట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ ఘటన పై అధికారులు తీవ్రంగా స్పందించారు. దీనికి బాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాజస్థాన్ లో మేవార్ విశ్వవిద్యాలయంలోనూ ఇటువంటి ఘటనలు జరగడంతో ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా  స్పందించారు. కాశ్మీర్ విద్యార్థులు తమ పిల్లలలని వారిపై ఎటువంటి దాడులు జరిగినా సహించేది లేదన్నారు. నిందితులపై పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని ఇటువంటి ఘటనలకు పాల్పడే  వారిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.కాశ్మీర్ లో సైనికులపై స్థానిక యువకులు దాడులకు  పాల్పడిన ఘటనల తాలూకూ వీడియోలు వైరల్ అయిన తరువాత కాశ్మీర్  విద్యార్థులపై దాడులు, విద్వేషపు వ్యాఖ్యలు పెరిగాయి. ఇటువంటి పరిణాలపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.