మళ్లీ మొదలైన కేబుల్ వార్

డిజిటలైజేషన్ పుణ్యమా అని కేబుల్ ఆపరేటర్ల మధ్య యుధ్దం మళ్లీ  మొదలైంది. ఏరియాల విషయంలో గొడవలు నిత్యకృత్యం అయ్యాయి. కేబుల్ ఆపరేటర్ల మధ్య గొడవలు ముదిరి దాడులదాకా వెళ్తున్నాయి. డిజిటలైజేషన్ చేయలనే ప్రభుత్వం నిర్ణయంతో ప్రస్తుతం కేబుల్ టీవీ వినియోగదారులంతా సెటాప్ బాక్సులను ఏర్పాటు చేయడం తప్పని సరి. దీని వల్ల ఆయా కేబుల్ ఆపరేటర్ల వద్ద ఎన్ని కనెక్షన్ లు ఉన్నాయనేది స్పష్టం గా తెలుస్తుంది. గతంలో అసలు కనెక్షన్ల కన్నా తక్కువ ఉన్నట్టు చూపడం ద్వారా కేబుల్ ఆపరేటర్లు కొద్ది మొత్తంలో సొమ్మును మిగుల్చుకునే వారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎన్ని కనెక్షన్ లు ఉన్నాయనేది సెటాప్ బాక్సుల వల్ల ఖచ్చితంగా తెలిసిపోతుంది. దీనితో దాని ఆధారంగా ఎం.ఎస్.ఓలకు కేబుల్ ఆపరేటర్లు రుసుము చెల్లించాల్సి వస్తోంది.  దీనితో ఆపరేటర్లకు ఆదాయం తగ్గిపోయింది. కనెక్షన్ లను పెంచుకునే క్రమంలో, ప్రాంతాలను విభజించుకునే క్రమంలో గొడవలు ముదురుతున్నాయి. దీనికి తోడు ఎమ్మెస్ ఓలు కూడా ఈ అగ్నికి ఆద్యం పోస్తున్నారు.

ప్రస్తుతం నగరంలో ఏనిమిది దాకా ఎంఎస్ఓ లున్నాయి. వీరంతా నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించారు. కేబుల్ ఆపరేటర్లు ఆయా ఎమ్మెస్ఓలనుండి సిగ్నల్ లను వినియోగదారులకు అందచేస్తారు. తమ ప్రాంతంలోకి కొత్త ఆపరేటర్లు రాకుండా స్థానిక ఆపరేటర్లు దాదాపు అందరు ఎమ్మెస్ఓల నుండి సిగ్నల్స్ తీసుకుంటున్నారు. తమ వద్ద వేయి కనెక్షన్ లు ఉంటే ఓక్కో ఎంఎస్ఓ కు ఇన్ని కనెక్షన్లు అంటూ అందరికీ చెల్లింపులు జరుపుతున్నామని ఒక కేబుల్ ఆపరేటర్ పేర్కొన్నారు. దీని వల్ల తమపై మరింత భారం పడుతోందని ఆయన చెప్పారు. అందరు ఎంఎస్ఓలకు డబ్బులు చెల్లించాల్సి రావడం భారంగా మారిందన్నారు. ఏ ఒక్క ఎంఎంస్ఓకు డబ్బులు ఇవ్వకపోయినా వెంటనే తమ ప్రాంతంలో ఇంకో ఆపరేటర్ ను సృష్టిస్తున్నారని సదరు ఆపరేటర్ ఆయా ఎంఎస్ఓలకు సంబంధించిన సిగ్నల్ ను మాత్రమే ప్రసారం చేయడం తో తక్కువ ధరకే కనెక్షన్ ఇచ్చే అవకాశం ఏర్పడుతోందని దీని వల్ల సంవత్సరాలుగా ఈ వ్యపారంలో ఉన్న తాము నష్టపోతున్నమని ఆయన  వాపోయారు. ఇటువంటి ఆపరేటర్లను డమ్మీ ఆపరేటర్లను పిల్చుకుంటామని చెప్పారు.

డమ్మీ ఆపరేటర్లను ప్రోత్సహించవద్దని కేబుల్ ఆపరేటర్ల సంఘంలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయాలు అమలుకావడం లేదన్నారు. డమ్మీ ఆపరేటర్లకు, ఆపరేటర్లకు మధ్య పోటీతో కనెక్షన్ల విషయంలో గొడవలు ముదురుతున్నాయి. గతంలో కేబుల్ ఆపరేటర్ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొని శాంతి భద్రతల సమస్యగా మారడంతో  పోలీసలు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో గొడవలు సర్థమణిగాయి.  అయితే తాజాగా తిరిగి ఆపరేటర్ల మధ్య యుద్ధాలు మొదలయి దాడులకు దిగేదాకా పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా మలక్ పేట పోలీస్  స్టేషన్ పరిధిలోని ఒక కేబుల్ ఆపరేటర్ ఉద్యోగి పై మరో కేబుల్ ఆపరేటర్ జరిపిన దాడిలో అతనికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.